చాలామంది తిరుపతికి వెళ్తుంటారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్తారు. చాలామంది స్వామివారి దర్శనం కాగానే మళ్లీ ఇంటిముఖం పడతారు. కానీ.. తిరుపతిలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎంతో దూరం నుంచి తిరుపతి వెళ్లినప్పుడు.. తిరుపతి చుట్టుపక్కన ఉన్న ప్రదేశాలను కూడా చూస్తే కాస్త రిలాక్స్ అయినట్టూ ఉంటుంది.. అంత దూరం వెళ్లినందుకు సంతృప్తి కూడా ఉంటుంది.
అయితే.. తిరుమల, తిరుపతి ఏరియాల్లో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నా… మీరు మిస్ కాకూడని ప్రాంతం ఒకటుంది. అదే తలకోన. అవును.. అదో పెద్ద అడవి. ప్రకృతిని నిలయం తలకోన. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, గుట్టలు.. ఆ కొండల మధ్య నుంచి జాలువారే సెలయేర్లు.. ఆహా.. అద్భుతం.. ఆ దృశ్యాన్ని కళ్లారా చూసి తీరాల్సిందే. అంత అందమైన తలకోన వాటర్ ఫాల్స్ ను మీరు దర్శించాల్సిందే.
తిరుపతి నుంచి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తలకోన వాటర్ ఫాల్. చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉంటుంది. పర్యాటక కేంద్రం కూడా. చాలామంది తిరుపతికి స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్లు.. తలకోనకు కూడా వెళ్తారు. అయితే.. చాలామంది తలకోన పేరు విని ఉంటారు కానీ.. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని మాత్రం తెలియదు వాళ్లకు.
తిరుపతికి దగ్గరగా ఇది ఉండటంతో తలకోన ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది. తలకోన చుట్టూ శేషాచల కొండలు ఉంటాయి. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుంచి జలపాతాలు కింద పడుతూ చూపరులను మైమరిపింపజేస్తాయి.
తలకోనకు ఎలా వెళ్లాలి?
తలకోనకు తిరుపతి, పీలేరు నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది. పీలేరు నుంచి అయితే 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి అయితే… 45 కిలోమీటర్లు. తలకోనలో రెస్ట్ తీసుకోవాలనుకునే వాళ్లకు అతిథి గృహాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే.. తలకోనలో అద్భుతమైన ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే మాత్రం నవంబర్ నుంచి జనవరి మధ్యలో వెళ్లాలి. మిగితా సమయాల్లోనూ వెళ్లొచ్చు. కాకపోతే… సెలయేర్లు ఎక్కువగా ఉండవు. వర్షాలు పడే సమయంలో అయితే.. సెలయేర్లు ఎక్కువగా ప్రవహిస్తుంటాయి. అయితే.. ఏ సమయంలో తిరుపతికి వెళ్లినా.. తలకోన వెళ్లిరండి. సెలయేర్లు లేకున్నా.. కాసేపు ప్రకృతితో మమేకమైపోవచ్చు. ఏమంటారు.