స్లిమ్​ అవ్వాలని రన్నింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

-

తింటే ఆయాసం.. తినకుంటే నీరసం. ఏం తిన్నా పొట్ట దగ్గరికే పోతుంది. అమ్మో మూడు సార్లు తింటే లావైపోతాం. ఎంత రన్నింగ్ చేసినా.. ఎన్ని గంటలు వాకింగ్ చేసినా బరువు తగ్గడం లేదు. అని చాలా మంది అభిప్రాయం. కొందరు తిన్న తర్వాత రిలాక్స్ అయితే బరువు పెరుగుతామని.. మరికొందరు తిన్న తర్వాత రన్నింగ్ చేస్తే సన్నబడతామని.. ఇంకొందరు ఏం తినకుండా రన్నింగ్ చేస్తే స్లిమ్​ అవుతామని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ అవగాహన లేకుండా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే రన్నింగ్ చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు బరువు తగ్గి స్లిమ్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా..?

కొందరు తినకముందు రన్నింగ్ చేస్తే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. కొవ్వు కరగకపోగా రన్నింగ్ చేసి అలసిపోతారు. ఇక నేరుగా నిద్రపోతారు. దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. అందుకే రన్నింగ్ చేసేముందు అరటి, యాపిల్, మామిడి, నట్స్, పాలు, పప్పులు, బ్రెడ్, కాయధాన్యాలు వంటివి ఏదైనా తినాలట. ఇవి తిన్న గంట తర్వాత రన్నింగ్ చేయాలట. వెంటనే పరుగు పెడితే ఆయాసం వస్తుంది. అందుకే గంటసేపు ఆగి రన్నింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిగెత్తడానికి గంట ముందు, తర్వాత నీళ్లు తాగాలి. పరిగెత్తేటప్పుడు నీళ్లు తాగకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.

కొంతమంది పరిగెత్తేటప్పుడు చేతుల్ని కదిలించకుండా స్థిరంగా ఉంచుతుంటారు. మరికొంతమందేమో కేవలం మోచేతుల్ని మాత్రమే ముందుకు వెనక్కి అంటూ పరుగు తీస్తుంటారు. ఇవి రెండు సరికాదు. రన్నింగ్ చేసేటప్పుడు భుజాలకు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలట! అంతేకాదు.. వాటిని మరీ పైకి లేపి కాకుండా.. పొట్టకు సమాంతరంగా ఉంచి భుజాలు కదిలేలా ముందుకు, వెనక్కి అంటూ పరిగెత్తుతుంటే త్వరగా అలసిపోకుండా, గాయాల పాలుకాకుండా జాగ్రత్తపడచ్చు.

వదులైన దుస్తులు లేదంటే పొట్టి దుస్తులు ధరించడం చాలామందికి అలవాటు! రన్నింగ్‌ చేసే క్రమంలోనూ కొంతమంది ఇలాంటి డ్రస్సింగ్‌నే ఫాలో అవుతుంటారు. నిజానికి ఏ కాలంలో రన్నింగ్‌ చేసినా వదులైన దుస్తులు, పొట్టిగా ఉండేవి అస్సలు వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే వదులైన దుస్తుల కారణంగా పరిగెత్తే క్రమంలో గాయాలు కావచ్చు.. కాబట్టి శరీరానికి అతికినట్లుగా ఉండే కాటన్‌ దుస్తులు లేదా మెత్తటి క్లాత్‌తో తయారుచేసిన జిమ్‌ వేర్‌ను ఎంచుకుంటే ఎప్పుడైనా కంఫర్టబుల్‌గా ఉండచ్చు.. ఇక వీటితో పాటు ఫిట్‌గా, అడుగుభాగంలో మెత్తగా ఉండే సోల్‌/స్ప్రింగ్స్‌ ఉండే రన్నింగ్‌ షూస్‌ని ఎంచుకుంటే పరిగెత్తడం మరింత సులభమవుతుంది. తద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడకుండానే అనుకున్న ఫలితాల్ని సొంతం చేసుకోవచ్చు.

ఇవాళ రన్నింగ్ చేయగానే రేపు బరువు తగ్గాలని ఆరాటపడటం సరికాదు. వేగంగా పరిగెత్తడం వల్ల బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమే. మీకు ఇంతకుముందు రన్నింగ్ అలవాటు లేకుండా మీరు సడెన్​గా వేగంగా పరిగెడితే ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు చెబుతున్నారు. అందుకే పరుగు మొదలుపెట్టే ముందు నెమ్మదిగా నడవాలి ఆపై క్రమంగా పరుగు ప్రారంభించాలి. వారంలో కనీసం ఒక రోజు వ్యాయామానికి పూర్తిగా దూరం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త శరీరానికి రెస్ట్ ఇస్తే వారమంతా ఉత్సాహంగా ఉంటారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news