దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ నేపథ్యంలో జనాలు గందరగోళానికి గురవుతున్నారు. టీకాలు లభించకపోవడంతో చాలా మంది కేంద్రాల వద్దకు వచ్చి వెనుదిరుగుతున్నారు. తగినన్ని డోసులు ఉండకపోవడం వల్ల సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు. వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారు. అయితే చాలా మంది కోవిడ్ టీకాలను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నప్పటికీ కొందరికి మాత్రం వ్యాక్సిన్ల పట్ల ఇంకా అపోహలు ఉన్నాయి. వాటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో చూడండి.
వ్యాక్సిన్లు పిల్లల కోసమే ?
వ్యాక్సిన్లు పిల్లల కోసమే తయారు చేస్తారు, పెద్దలకు కాదు అన్న విషయం తప్పు. ఎందుకంటే కొన్ని రకాల వ్యాధులు పెద్ద వయస్సులో రాకుండా ఉండేందుకు చిన్నారులకు ఆ వయస్సులోనే టీకాలు వేస్తారు. అంతమాత్రం చేత టీకాలు చిన్నారులకేనని పెద్దలకు కాదని అనుకోకూడదు. కరోనా లాంటి మహమ్మారులు వస్తే పెద్దలకూ టీకాలు వేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పెద్దలందరికీ వ్యాక్సిన్లు అవసరం లేదు ?
ఫలానా వైరస్ వారికి వస్తుంది, వీరికి రాదు అని లేదు. ఏ వైరస్, ఏ వ్యాధి ఎవరికైనా రావచ్చు. కొన్నిసార్లు ఒకరికి వచ్చిన వ్యాధి ఇంకొకరికి వ్యాపించవచ్చు. లక్షణాలు లేకున్నా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కనుక వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ టీకాలను తీసుకోవాల్సిందే. అందుకు ఎవరూ మినహాయింపు కాదు.
టీకాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ?
టీకాలు తీసుకున్న తరువాత ఎవరికైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంత మాత్రం చేత భయపడాల్సిన పనిలేదు. టీకా తీసుకున్నాక చాలా మంది జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. ఇది అత్యంత సహజం. అలా లక్షణాలు కనిపిస్తేనే టీకా పనిచేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. టీకాలు తీసుకోవడం పూర్తిగా సురక్షితం. దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉండవు. అందువల్ల ప్రతి ఒక్కరూ టీకాలను తీసుకోవాలి.
టీకాలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ?
ఇది పూర్తిగా అవాస్తవం. టీకాలను తీసుకుంటేనే కొన్ని రోజులకు శరీరంలో యాంటీ బాడీలు తయారవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది.
ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకున్నా, కోవిడ్ టీకా అవసరం లేదు ?
ఏ అనారోగ్య సమస్యలకు వ్యాక్సిన్ తీసుకున్నా సరే, ఒక్కో సమస్యకు ఒక్కో టీకా ఉంటుంది కనుక అన్ని సమస్యలకు నిర్దేశించబడిన టీకాలను తీసుకోవాలి. ఒక టీకా తీసుకుంటే దానికి సంబంధించిన వ్యాధిని రాకుండా అడ్డుకోగలం, కానీ ఇతర వ్యాధులను అడ్డుకోలేం. కనుక అన్ని టీకాలను తీసుకోవాల్సిందే. ఒక టీకా ఇంకో అనారోగ్య సమస్యను రాకుండా చూస్తుందని అనుకోకూడదు. కచ్చితంగా అన్ని అనారోగ్య సమస్యలు రాకుండా అన్ని టీకాలను తీసుకోవాల్సిందే.