కరోనా చికిత్సకు గాను ఫార్మా సంస్థ జైడస్ కడిలా అభివృద్ధి చేసిన వైరాఫిన్‌కు ఏప్రిల్ 23వ తేదీన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన విషయం విదితమే. దీన్నే జైడస్ కడిలా పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ ఆల్ఫా-2బిగా వ్యవహరిస్తోంది. అయితే ఈ మెడిసిన్ ధరను జైడస్ కడిలా కంపెనీ తాజాగా ప్రకటించింది.
వైరాఫిన్ ఒక్క డోసును రూ.11,995 ధరకు విక్రయిస్తున్నట్లు జైడస్ కడిలా తెలియజేసింది. ఈ మెడిసిన్‌ను కోవిడ్ మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్నవారికి కూడా ఉపయోగించవచ్చు. దీంతో వారిలో వైరల్ లోడ్, ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. ఈ క్రమంలో వారు ఆక్సిజన్ మీద ఆధార పడే శాతం తగ్గుతుంది. త్వరగా కోలుకుంటారు.
వైరాఫిన్‌కు గాను నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మెడిసిన్ 91 శాతం మేర పనిచేసిందని జైడస్ కడిలా తెలిపింది. ఈ మెడిసిన్ తీసుకున్న వారికి 7 రోజుల్లో కోవిడ్ నయం అయిందని, 7వ రోజు తరువాత ఆర్‌టీ పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపింది. అయితే ఈ మెడిసిన్‌ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయిస్తారని, డాక్టర్ సూచన, పర్యవేక్షణ లేకుండా దీన్ని వాడరాదని జైడస్ తెలియజేసింది.