ఒక పని అలవాటుగా మారాడానికి రోజూ కష్టపడుతున్నారా.. ఐతే ఇది తెలుసుకోవాల్సిందే..

-

కొత్త సంవత్సరం వచ్చినా, పుట్టిజరోజు వచ్చినా.. అప్పటికప్పుడు అన్నీ మార్చేసి రేపటి నుండి ఇలా ఉండకూడదు. పూర్తిగా మారిపోవాలి. కొత్త కొత్త అలవాట్లు చేసుకోవాలి. చెడు అలవాట్లని మానుకోవాలి. రేపటి నుండి చూసేవాళ్ళందరూ నాలో వచ్చిన మార్పుని చూసి షాక్ అవ్వాలని ఊహించేసుకుని, ఇక అన్నీ మారిపోయాయి అని చెప్పి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఐతే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఉన్నంత పట్టుదల ఆ తర్వాత మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది.

ఫలితం.. మళ్ళీ ఎప్పటిలానే రోజూ అదే జీవితాన్ని గడుపుతుంటారు. జీవితంలో ఇలాంటి నిర్ణయాలు చాలాసార్లు తీసుకుంటారు. కానీ ప్రతీసారీ ఫెయిల్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలుండవచ్చు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకే రోజులో మనలో మార్పు రావాలని కోరుకోవడమే అని చెబుతున్నారు. నేటి వరకూ ఒకలా ఉండి, రేపటితో పూర్తిగా మారిపోవాలని అనుకోవడం, పాత అలవాట్లని మానుకుని సడెన్ గా కొత్త అలవాట్లని అలవర్చుకోవాలని అనుకోవడం ఒత్తిడిని పెంచుతుంది. దానివల్ల ఆ అలవాట్లు అభివృద్ధి కాకముందే మధ్యలోనే వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఐతే కొత్త అలవాట్లని ఏ విధంగా అలవర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఏదైనా మొదలు పెట్టినపుడు ముందు చిన్నగా ప్రారంభించండి. చిన్న చిన్న పనులు మనమీద ఒత్తిడి కలిగించవు. దాని వల్ల ఆ అలవాటు మానేసే ప్రమాదం ఉండదు. ఉదాహరణకి ఒక పుస్తకం చదవాలని అనుకున్నారనుకోండి. అప్పటి వరకూ అసలు పుస్తకం చదవడమే అలవాటు లేదనుకుందాం. అపుడు రోజుకి ఒక పేజీ మాత్రమే చదవండి. అలా మెల్ల మెల్లగా చదవడం అలవాటు అవుతుంది. పుస్తకం విషయం ఒక్కటే కాదు. ఏ విషయంలోనైనా ఇది వర్తిస్తుంది.

కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలన్న మాటలు ఇక్కడ పనికిరావు. కొంచెం మెల్లగా అయినా సరే మొదలెట్టండి. పెద్ద తుఫాను కూడా చిన్న చినుకుతోనే మొదలవుతుంది. చిన్న చిన్న నీటి తుంపర్లతో కూడా బకెట్ నిండుతుంది. అందుకే మీ బకెట్ నిండాలంటే ముంచు చిన్నగా స్టార్ట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news