ఈ ఒక్క ఫోటోను చూసి లక్షల మంది చలించిపోయారు…!

వెయ్యి పదాల కన్నా ఒక్క ఫోటో మిన్న అన్నారు పెద్దలు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అటువంటిదే. దాని గురించి పేజీలకు పేజీలు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫోటోను చూస్తే అర్థమయిపోతుంది. ఎంతో మంది నెటిజన్ల హృదయాలను పిండేసింది ఆ ఫోటో. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటో ఏకంగా ఆ కుటుంబానికి దాదాపు 57 లక్షల రూపాయలను అందించింది.

అసలేంజరిగిందంటే… ఢిల్లీకి చెందిన అనిల్ అనే పారిశుద్ధ్య కార్మికుడు పారిశుద్ధ్యానికి సంబంధించిన పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో ఊపిరాడక చనిపోయాడు. అనంతరం అతడి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు కుటుంబానికి బాడీని అందించారు. అప్పుడు అతడి 11 ఏళ్ల కొడుకు తండ్రి ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తీసి తండ్రి ముఖాన్ని పట్టుకొని ఏడుస్తుండగా… ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలే పేద కుటుంబం.. పైగా ఆ వ్యక్తి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవని తెలుసుకున్న ఓ ఎన్జీవో ఓ వెబ్ సైట్ ద్వారా నిధులను సేకరించడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల్లోనే దాదాపు రూ.57 లక్షల వరకు సమకూరాయి. ఆ డబ్బును తీసుకెళ్లి త్వరలోనే అనిల్ కుటుంబానికి అందించనున్నట్లు ఎన్జీవో ప్రకటించింది.