స్కూల్ యాజ‌మాన్యం ఉదార‌త‌.. 3వేల మంది విద్యార్థుల‌కు రూ.1.80 కోట్ల ఫీజు మాఫీ చేశారు..

-

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం దేశంలోని అనేక ప్రైవేటు స్కూళ్ల ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతాలు ఇచ్చే ప‌రిస్థితి లేదు. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన న‌ష్టాన్ని ఇప్ప‌టికీ ఇంకా స్కూళ్లు భ‌ర్తీ చేసుకోలేక‌పోయాయి. దీనికి తోడు త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌ల ఫీజుల‌ను చెల్లించ‌డం లేదు. ఫ‌లితంగా ప్రైవేటు స్కూళ్ల యాజ‌మాన్యాలు తీవ్ర‌మైన న‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే ముంబైలోని ఆ స్కూల్ యాజ‌మాన్యం మాత్రం క‌రోనా న‌ష్టాలు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఉపాధ్యాయులు, సిబ్బందికీ నెల నెలా వేత‌నాల‌ను చెల్లిస్తోంది. అంతేకాదు.. ఆ స్కూల్ విద్యార్థులు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు బ‌కాయిల‌ను స్కూల్ యాజ‌మాన్యం మాఫీ చేసింది.

private school in mumbai waived of rs.1.80 crores of fees to students

ముంబైలోని వెర్సోవా అనే గ్రామానికి చెందిన చిల్డ్ర‌న్ వెల్ఫేర్ సెంట‌ర్ (సీడ‌బ్ల్యూసీ) హై స్కూల్ 40 ఏళ్లుగా న‌డుస్తోంది. అది ప్రైవేటు స్కూలే అయిన‌ప్ప‌టికీ ఫీజుల‌ను త‌క్కువ‌గానే వ‌సూలు చేస్తారు. అయితే క‌రోనా వ‌ల్ల ప్ర‌స్తుతం స్కూల్ యాజ‌మాన్యం విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తోంది. అయితే అందుకు గాను ఉపాధ్యాయుల‌కు అయ్యే క‌రెంటు ఖ‌ర్చు, ఇంట‌ర్నెట్ ఖ‌ర్చుల‌ను స్కూల్ యాజ‌మాన్య‌మే భ‌రిస్తోంది. అలాగే వారికి వేత‌నాల‌ను కూడా చెల్లిస్తోంది.

ఇక స్కూల్‌కు చెందిన 30 శాతం మందికి పైగా విద్యార్థులు పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారే. దీంతో క‌రోనా వ‌ల్ల ఆయా కుటుంబాలు ఆర్థికంగా బాగా చితికిపోయాయి. ఈ క్ర‌మంలో వారు త‌మ పిల్ల‌ల స్కూల్ ఫీజుల‌ను గ‌త వేస‌వి నుంచి చెల్లించ‌డం లేదు. అయితే వారి స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకున్న ఆ స్కూల్ యాజ‌మాన్యం మొత్తం 3 నెల‌ల‌కు గాను 3వేల మంది విద్యార్థుల స్కూల్ ఫీజు రూ.1.80 కోట్లను మాఫీ చేసింది.

స్కూల్‌లో చాలా మంది విద్యార్థుల త‌ల్లిదండ్రులు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారేన‌ని, వారు త‌మ పిల్ల‌ల స్కూల్ ఫీజుల‌ను చెల్లించ‌డం లేద‌ని, క‌రోనా వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌చ్చినందునే వారు ఫీజుల‌ను చెల్లించ‌లేక‌పోతున్నార‌ని.. అందుక‌నే వారు క‌ట్టాల్సిన దాంట్లో 3 నెల‌ల వ‌ర‌కు ఫీజును మాఫీ చేశామ‌ని స్కూల్ ప్రిన్సిపాల్ అజ‌య్ జ‌వ‌హ‌ర్ కౌల్ తెలిపారు. కాగా ఆ స్కూల్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎంతో మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఊర‌ట‌నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news