బెజవాడ మేయర్ సీట్ పై అప్పుడే కర్చీఫ్ వేస్తున్న వైసీపీ నేతలు

-

స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా జరగనే లేదు అప్పుడే బెజవాడ వైసీపీలో మేయర్ కుర్చీ పార్టీ నేతల మధ్య కుస్తీకి కారణమవుతోందట. టీడీపీ హయాంలో కార్పొరేషన్ ను టీడీపీ కైవసం చేసుకోవటంతో ఇప్పుడు ఎలాగైనా బెజవాడ కార్పొరేషన్ లో పాగా వేయాలని వైసీపీ పట్టుదలగా ఉంది. అదే స్పీడ్ లో ఉన్న వైసీపీ నేతలు మేయర్ కుర్చి పై తమ వారిని కూర్చో పెట్టేందుకు ముందే కర్చీఫ్ వేస్తున్నారట..దీంతో వైసీపీ అధిష్టానం కూడా కూడా మేయర్ కుర్చీ ఇవ్వటానికి కొత్తగా ఓ లెక్క సెట్ చేసిందట.

ఏపీలో అత్యంత కీలకమైన నగరాల్లో బెజవాడ ఒకటి. ఇక్కడ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. బెజవాడలో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలో గెలిచిన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీకి దక్కించుకున్న మేయర్ పీఠాన్ని ఈసారి వైసీపీ దక్కించుకేనుందుకు ప్రత్యేక ప్యూహాన్ని రూపొందిస్తుంది. అయితే ఎన్నికల కంటే ముందు బెజవాడ వైసీపీ నేతలు మేయర్ సీటు గురించి తమదంటే తమదంటూ లెక్కలు వేసుకుంటున్నారట. బెజవాడలో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు ఉన్నాయి.

బెజవాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 59 డివిజన్లుంటే ఇప్పుడు వాటి సంఖ్య 64కి చేరుకుంది. గతంలో మాదిరే ఈ సారి కూడా మేయర్ మహిళ జనరల్ కు రిజర్వ్ కావటంతో అధికార పార్టీ నేతలు మేయర్ సీటుపై కన్నేశారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు తన వర్గానికే మేయర్ సీటు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. గత టీడీపీ హయాంలో ఐదేళ్లపాటు తూర్పు నియోజకవర్గానికి చెందిన వారు మేయర్ గా పనిచేశారు. ఈ సారి పశ్చిమ నుంచి తన వారిని మేయర్ చేస్తే నగరంలో పట్టు పెంచుకోవటంతోపాటు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించాలని మంత్రి ఆలోచన చేస్తున్నారట.

ఇక సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది కూడా తన వర్గానికి మేయర్ సీటు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారట. మంత్రి పదవి కూడా తనకు ఇవ్వలేదు కాబట్టి తన వారికి మేయర్ పదవి ఇప్పిస్తే నగరంలో తన హవా పెంచుకోవచ్చని మల్లాది ఆలోచనగా ఉందట. ఇక తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి ఎమ్మెల్యే లేరు. ఇక్కడ టీడీపీ గెలవటంతో ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ ఉన్నారు. ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి లేరు కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి మేయర్ కు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతమై నియోజకవర్గం పై పట్టు పెరుగుతుందని అవినాష్ భావిస్తున్నారు. కార్పొరేషన్ లో గత ఐదేళ్ళపాటు వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న పుణ్యశీల, మాజీ కార్పొరేటర్ గౌతం రెడ్డి కుమార్తె ఇలా మరికొందరు సొంత ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనితో అధిష్టానం వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఓ లెక్క సెట్ చేసినట్లు తెలుస్తుంది.

బెజవాడ కార్పొరేషన్ లో ఉన్న మూడు నియోజకవర్గాల్లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. ఇందులో తూర్పులో 19 నియోజకవర్గాలు ఉండగా పశ్చిమలో 21,సెంట్రల్ లో 23 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో తూర్పులో 9, పశ్చిమలో 7,సెంట్రల్ లో 3 చొప్పున వైసీపీ గెలిచింది. దీంతో ఈసారి ఏ నియోజకవర్గంలో ఎక్కువ సీట్లు గెలిస్తే అక్కడ వారికి మేయర్ సీటు ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందట. బెజవాడలో టీడీపీ కూడా బలంగా ఉంది. అందుకే ఏ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచి మేయర్ సీటు గెలుపుకు కీలకంగా మారతారో ఆ నియోజకవర్గానికి మేయర్ సీటు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోందని టాక్. దీంతో నేతలు కార్పొరేటర్ అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా మార్చే పనిలో ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news