హైడ్రోపోనిక్స్.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అనేక మంది ఆర్గానిక్ ప్రియులు అనుసరిస్తున్న విధానాల్లో ఇదొకటి.. ఈ విధానంలో మొక్కలకు వాడే నీటిలో కేవలం 10 శాతం నీటిని మాత్రమే వాడుకుని పంటలు పండించవచ్చు. ఈ విధానంలో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. మొక్కలకు మట్టి నుంచి కావల్సిన పోషకాలను అందించడం కోసం కొద్దిగా మట్టిని జోడించి పూర్తిగా నీటిలోనే వాటిని పండిస్తారు. దీంతోపాటు వాటికి కావల్సిన పోషకాలను టైముకు అందిస్తారు. దీంతో మొక్కలు ఇండోర్‌లోనూ చాలా త్వరగా పెరుగుతాయి. పంట బాగా వస్తుంది. అయితే ఈ హైడ్రోపోనిక్స్‌ను మరింత స్మార్ట్‌గా చేస్తే.. ఎలా ఉంటుంది.. అని ఆలోచించాడు అతను. అంతే.. తన ఆలోచనను అమలులో పెట్టేశాడు. హైడ్రోపోనిక్స్‌ను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా చేసేందుకు గాను నూతన పరికరాన్ని కనిపెట్టాడు.
అతని పేరు యష్. ఢిల్లీ వాసి. 2013లో దుబాయ్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. అయితే అప్పట్లో హైడ్రోపోనిక్స్‌పై పత్రికలో ప్రచురించిన ఓ కథనం చదివి అను ప్రేరణ పొందాడు. అయితే హైడ్రోపోనిక్స్ నిజానికి కొంత కష్టతరమైన పని. అందులో 90 శాతం నీటితోనే మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అలాగే సరైన టైముకు వాటికి సరైన పోషకాలను అందించాలి. లేదంటే మొక్కలు పెరగవు. ఈ క్రమంలో ఆ పద్ధతిని మరింత సులభతరం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. అందులో భాగంగానే హైడ్రోపోనిక్స్‌కు సాంకేతిక పరిజ్ఞాం జోడించి ఓ నూతన స్మార్ట్ పరికరాన్ని తయారు చేశాడు. దాని పేరే.. ఆగ్రో2ఓ (Agro2o) స్మార్ట్ గార్డెన్..
ఆగ్రో2ఓ స్మార్ట్ గార్డెన్ డివైస్ ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. ఇందులో మట్టిని అసలు ఉపయోగించరు. పూర్తిగా నీటితోనే మొక్కలను పెంచుతారు. మొక్కల వేళ్లు నీళ్లలో మునిగి ఉంటాయి. ఇక టైముకు నీరు పోస్తే చాలు. అవే పెరుగుతాయి. ఇక మొక్కలకు పోషకాలను అందించేందుకు గాను ఓ న్యూట్రిషన్ క్యాట్రిడ్జ్ ఉంటుంది. అందులో నుంచి టైముకు మొక్కలకు పోషకాలు అందుతాయి. మనం ఏమీ చేయాల్సిన పనిలేదు. దీంతో చాలా సులభంగా మొక్కలు పెరిగి పంట చేతికొస్తుంది. ఇక ఈ ప్రాసెస్‌ను అంతా మొబైల్ యాప్ ద్వారా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఇండోర్‌లో మొక్కలు పెంచుతాం కాబట్టి వాటికి ఎంత లైటింగ్ అవసరం అనేది కూడా సదరు డివైస్ నిర్ణయించి అందజేస్తుంది. దీంతో మొక్కలు చాలా సులభంగా పెరుగుతాయి. ఇలా మొక్కలు పెరగగానే పంటను తీసి మళ్లీ డివైస్‌లో ఉండే సీడ్‌పాడ్‌లో మనకు కావల్సిన మొక్కల విత్తనాలు వేసి మొక్కలను పెంచవచ్చు. ఇలా ఆగ్రో2ఓ స్మార్ట్ గార్డెన్ డివైస్ తో మనం ఇండ్లలోనే చాలా సులభంగా హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలను పెంచవచ్చు.
ఇక యష్ ఆగ్రో2ఓ స్మార్ట్ గార్డెన్ డివైస్ కింద రెండు వేరియెంట్లను తయారు చేశాడు. వాటిలో ఓకటి సేవర్ కాగా అందులో ఏకంగా ఒకేసారి 4 మొక్కలు పెంచవచ్చు. ఇక రీనెయిసెన్స్ అనబడే మరో వేరియెంట్ డివైస్‌లో ఒకేసారి 12 మొక్కలు పెంచవచ్చు. ఈ డివైస్‌లతోపాటు సీడ్‌పాడ్స్, న్యూట్రిషన్ క్యాట్రిడ్జ్‌లు వస్తాయి. ఇక డివైస్‌లలో నీళ్లను పోసి, సీడ్‌పాడ్‌లలో మనం పెంచాలనుకునే మొక్కల విత్తనాలు వేసి, అందుకు అనుగుణంగా న్యూట్రిషన్ క్యాట్రిడ్జ్‌లు అమరిస్తే మొక్కలు పెరుగుతాయి. ఇక పంటను బట్టి న్యూట్రిషన్ క్యాట్రిడ్జ్‌లను అమర్చాలి. ఒక్కో పంటకు ఒక్కో రకమైన పోషకాలు కావాలి కనుక, ఆ క్యాట్రిడ్జ్‌లను కూడా అందుకు అనుగుణంగా తయారు చేయాలి. ఇక ఒక డివైస్‌లో ఒకే రకమైన మొక్కలు పెంచాలి. వేర్వేరు మొక్కలుకు వేర్వేరు పోషకాలు అవసరం కనుక ఒకే రకమైన మొక్కలను పెంచాల్సి ఉంటుంది. కాగా ఆగ్రో2ఓ స్మార్ట్ గార్డెన్ సేవర్ డివైస్ ధర రూ.7,999 ఉండగా, రీనెయిసెన్స్ డివైస్ ధర రూ.17,999 గా ఉంది. అయితే తనకు ప్రభుత్వాలు సహకారం అందిస్తే ఇంకా చాలా తక్కువకే ఈ స్మార్ట్ గార్డెన్ పరికరాలను అందిస్తానని యష్ చెబుతున్నాడు..!