నీకేం కావాలో నిజంగా నీకు తెలుసా? దేవుడిని చూడాలనుకున్న ఈ యువకుడి కథ చదవండి.

సాయంకాల సమయాన నదీతీరాన, ఇసుక తిన్నెల్లో ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు. చుట్టూ ఒక్క మనిషి కూడా లేని ఆ ప్రాంతంలో నదీ తరంగాల చప్పుడు ఏమీ వినిపించట్లేదు. కొన్ని నిమిషాలు అలాగే గడిచాయి. ఇక వెళ్దామని సన్యాసి లేచాడు. అప్పుడు కనిపించాడు ఆ యువకుడు. తన వెనకాల ఎప్పటి నుండి ఉన్నాడో తెలియదు, సన్యాసి ఎప్పుడు లేస్తే అప్పుడు పలకరించాలని డిసైడ్ అయినట్టున్నాడు. వెంటనే, స్వామీజీ అని ముందుకు వచ్చాడు. ఆ యువకుడిని సన్యాసి, అప్పటి నుండి నా వెనకే ఉన్నావా నాయనా అని అడిగాడు.

దానికి అవును స్వామీ, నేను ఇక్కడకు ఒక విన్నపంతో వచ్చాను. అది మీరు వింటారని, ఆ విన్నపాన్ని మన్నిస్తారని అనుకుంటున్నా అన్నాడు. సరే నాయనా, దానిదేముంది చెప్పు అన్నాడు. నన్ను మీ విద్యార్థిగా చేసుకోండి. నేను కూడా మీతో పాటే ఉంటాను అన్నాడు. అది విన్న సన్యాసి కొద్దిగా నవ్వి, ఎందుకు నాయనా? నా విద్యార్థిగా ఉండి ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్? అని అడిగాడు.

అప్పుడు ఆ యువకుడు, నేను దేవుడిని చూడాలనుకుంటున్నా అని చెప్పాడు.

అది విన్న వెంటనే ఆ యువకుడు గల్లా పట్టుకుని నదీ లోపలికి తీసుకెళ్ళి, తల మొత్తం మునిగేలా నీళ్ళలో ముంచాడు. ఒక్కసారిగా స్వామీజీ అలా చేసేసరికి ఏమీ అర్థం కానీ యువకుడు గాలి ఆడక గిలగిలా కొట్టుకోసాగాడు. ఒక నిమిషం తర్వాత ఆ యువకుడిని బయటకు తీసాడు సన్యాసి.

నీళ్ళలో నుండి తల బయటకు తీయగానే నోట్లోకి పోయిన నీళ్ళన్నింటినీ కక్కాడు. ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా అనుకుని, కొద్ది సేపయ్యాక కామ్ అయ్యాడు. యువకుడు కామ్ అయ్యాక, అతని దగ్గరకి వచ్చిన సన్యాసి, ఇప్పటి వరకు నీకు ఏం కావాలనిపించింది అన్నాడు.

గాలి.. గాలి ఆడక చచ్చిపోతానని, గాలి కావాలనిపించింది అన్నాడు ఆ యువకుడు. అదే మరి, నీటిలో నిన్ను ముంచినపుడు కూడా దేవుణ్ణి చూడాలనే కోరిక నీలో కలిగినపుడు నేను చూపించేవాడిని, నీది కేవలం ఒక అనుభవం కోసం చూస్తున్న ఆలోచనే తప్ప అందులో పెద్దగా పట్టుదల లేదు అన్నాడు.

మీ జీవితంలో ఏదైనా సరే కావాలనుకుంటే చాలా గట్టిగా అనుకోండి. ఏదో రుతువు పోయి రుతువు వచ్చినట్టుగా కాకుండా చాలా గట్టి సంకల్పంం ఉండాలి. అలాంటప్పుడే సక్సెస్ దొరుకుతుంది.

డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా