అనుకున్నది సాధించలేదని బాధపడితే లాభమేంటి? మరేం చేయాలి?

ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన ఈ డైలాగ్, జీవితంలో చాలాసార్లు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అనుకున్నవన్నీ అన్ని వేళలా జరగవు కాబట్టి. అవును.. చిన్నప్పటి నుండి పెద్దయ్యి, పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల కలిగి, వారి పెళ్ళిళ్ళయ్యి, జీవితం చరమాంకం వరకూ ఎన్నో అనుకుంటాం. అందులో కనీసం 25శాతం అనుకున్నట్టు జరుగుతాయా అంటే సందేహమే.

చిన్నప్పుడు కావాల్సిన బొమ్మ కొనివ్వమని ఏడ్వడం నుండి పెద్దయ్యాక తన కొడుకు ప్రేమ పేరుతో నచ్చని పెళ్ళి చేసుకున్నాడనే వరకూ ఏదీ అనుకున్నట్టుగా జరగవు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి. నా అదృష్టం ఇంతే అని ఊరుకోవాలా? లేక అసలేమీ చేయలేకపోయానే అని బాధపడుతూ, నిన్ను నువ్వు తిట్టుకుంటూ కూర్చోవాలా? అసలేం చేయాలి.

ఈ రోజు నువ్వు అనుకున్నది సాధించలేకపోయినా రేపు అనేది మిగిలే ఉంది. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ మరుసటి రోజు.. ఇలా నీకంటూ ఏదో ఒక రోజు ఉంటుంది. నువ్వు చేయాల్సిందల్లా ప్రయత్నాన్ని ఆపకుండా ఆ ప్రయత్నంలో ఆనందం పొందడమే. చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకూ ఎన్నోసార్లు ఓడిపోయి ఉండవచ్చు. కానీ గెలిచే రోజు ఒక్కరోజైనా వస్తుందని గుర్తుంచుకో. అంతకంటే ముందు ఆల్రెడీ గెలిచేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తుతెచ్చుకో.

ఆలోచించు, జీవిత బండిని ఇంతదాకా లాక్కొచ్చావంటే గెలవలేదని అర్థమా.. నీ వల్ల ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ సంతోష పడి ఉండవచ్చు. ఆ విషయం నీకు కూడా తెలియకపోవచ్చు. అందుకే ఎవరో నిన్ను గుర్తించలేదనో, బాధపెట్టారనో, డబ్బు లేదనో డీలా పడిపోవద్దు. నీదంటూ ఒకరోజు వస్తుందని ఆశతో వేచి చూస్తూ ఉండు. ఆ వెయిటింగ్ ని ఎంజాయి చెయ్యి. గెలుపు వచ్చే తీరుతుంది.