2020 సంవత్సరాంతంలో ఓ అరుదైన ఖగోళ వింత కనిపించనుంది. డిసెంబర్ 21న అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుందని ఖగోళ నిపుణులు చెప్తున్నారు. ఇది 397 సంవత్సరాల క్రితం వచ్చిందని మరల ఇప్పుడు కనిపిస్తుందని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ అద్భుతం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదివేయండి.
అంతరిక్షంలో సౌరకుటుంబం ఉంటుందని మనకు తెలిసిందే. అయితే ఆ కుటుంబంలోని 9 గ్రహాల్లో ఏవీ ఒకదాని ఒకటి సంబంధం లేకుండా వాటివాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. ఎప్పుడో ఒక సారి ఖగోళంలోని జరిగే మార్పులకు అనుగుణంగా కొన్ని వింతలు సంభవిస్తుంటాయి. అయితే అందులో భాగంగానే ఈ 2020 సంవత్సరాంతంలో గురు, శని గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి రానున్నాయి. ఇవి రెండూ కలిపి ఆకాశంలో ఓ నక్షత్రంలా కనిపించనున్నాయని అంటున్నారు. ఇలా చివరిసారిగా 1623 సంవత్సరంలో ఈ రెండు గ్రహాలు ఇంత సమీపానికి వచ్చాయని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే దాదాపుగా 397 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఆ అద్భుతం జరగబోతోందని బిర్లా ప్లానెటేరియం డైరెక్టర్ దేబి ప్రసాద్ దువారీ చెప్పారు. దీనిని ఓ గ్రేట్ కంజంక్షన్‌గా పిలుస్తారని ఆయన వెల్లడించారు.
ఏవైనా రెండు ఖగోళ రాశులు భూమి నుంచి చూసినప్పుడు రెండూ అత్యంత సమీపంగా కనిపిస్తే దానిని కంజంక్షన్ అంటారని వెల్లడించారు. అదే గురు, శని గ్రహాల విషయంలో గ్రేట్ కంజంక్షన్ అంటారని చెప్పారు. ఇది మళ్లీ తిరిగి మార్చి 15, 2080లో ఇలా అత్యంత సమీపంగా కనిపిస్తాయని చెప్పుకొచ్చారు.
ఈనెల 21న రాత్రిపూట ఈ రెండు గ్రహాల మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లుగా ఉంటుందని దేబి ప్రసాద్ తెలిపారు. ఆ రోజు సూర్యస్తమయం తర్వాత ఇండియాలోని చాలా నగరాల్లో ఈ కంజంక్షన్ కనిపిస్తుందని చెప్పారు ఆయన తెలిపారు. ఆ రోజు వరకూ ప్రతి రోజూ ఈ రెండు గ్రహాల మధ్య దూరం క్రమంగా తగ్గడం కూడా చూడొచ్చని పేర్కొన్నారు.