గ్రేటర్ మేయర్ ఎవరో ? ఆ రెడ్డా ఈ రెడ్డా ?

-

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో  గెలిచాము అనే ఆనందం కంటే, బిజెపి బాగా బలపడడం టిఆర్ఎస్ అగ్రనాయకులు ఎవరికే నిద్ర లేకుండా చేస్తోంది. గతంలో మాదిరిగా గ్రేటర్ పీఠం సొంతంగా దక్కించుకుని ఇష్టారాజ్యంగా పరిపాలన చేపట్టేందుకు టిఆర్ఎస్ కు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. దీనికి కారణం  టిఆర్ఎస్ కు వచ్చిన స్థానాలతో పాటు,  ఎక్స్ ఆఫీసియో ఓట్లను లెక్కలోకి తీసుకున్నా,  టిఆర్ఎస్ తప్పనిసరిగా ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా జరిగితే ఆ పార్టీ పెట్టే నియమనిబంధనలు అన్నిటిని తప్పనిసరిగా ఒప్పుకుని ఆ పార్టీకి తగిన ప్రాధాన్యం ఇస్తూ, పరిపాలన చేయాల్సిన పరిస్థితి టిఆర్ఎస్ కు దాపురించింది.
 ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టిఆర్ఎస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి మేయర్ పదవిని మహిళలకు కేటాయించడంతో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. టిఆర్ఎస్ నుంచి గెలుపొందిన వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. వారిలో చాలామంది రెండోసారి గెలిచిన వారు కావడంతో, తమకు అవకాశం దక్కుతుందని గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. గత మేయర్ పదవి లో బిసి సామాజిక వర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ ఉండగా, ఈసారి ఓసి మహిళ లు ఆ పదవిని దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ లో ఇప్పుడు మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న వారిలో సింధు రెడ్డి, విజయ రెడ్డి , మాధవరం రోజా రావు, చింతల శాంతి వంటి వారు గట్టిగా పోటీపడుతుండగా, రెండోసారి ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన విజయ రెడ్డి మేయర్ పదవి తనకే అని ఆశలు పెట్టుకోవడం తో పాటు , ఆ మేరకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే రెండోసారి గెలిచిన సింధు రెడ్డి సైతం గట్టిగానే ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు . ఇప్పటికే కెసిఆర్ ఆమెను స్వయంగా పిలిపించుకుని మరీ అభినందనలు తెలపడంతో ఆమె మేయర్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే విజయ రెడ్డి, సింధు రెడ్డి ల లో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు గా టిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. అలాగే టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె కేశవ రావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి వంటి వారు పోటీపడుతున్నా, సింధు రెడ్డి-  విజయ రెడ్డి లలో ఒకరికి ఈ పదవి ఎక్కే అవకాశం ఉన్నట్లుగా టిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. మరి కెసిఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news