సెంచ‌రీ చేస్తే లేదా 5 వికెట్లు తీస్తే.. 20వేల పౌండ్లు..!

-

భార‌త్‌-ఇంగ్లండ్‌ల మ‌ధ్య చివ‌రిదైన ఐదో టెస్టు రేప‌టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లండ‌న్‌లోని ది ఓవ‌ల్ మైదానంలో ఈ టెస్టు ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే భార‌త్ 1-3 తేడాతో సిరీస్‌ను చేజార్చుకోగా టీమిండియా ప్లేయ‌ర్ల‌పై స‌ర్వ‌త్రా విమర్శ‌లు వ‌స్తున్నాయి. కోచ్ ర‌విశాస్త్రి త‌ప్పుకోవాలంటూ ప‌లువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విష‌యాల‌న్నింటినీ ప‌క్క‌న పెడితే.. భార‌త్‌, ఇంగ్లండ్ ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న 5వ టెస్టు ఒక విష‌యంలో మాత్రం ఆస‌క్తిని రేపుతోంది. అదేమిటంటే…

మిక్ జాగ‌ర్‌.. ఇత‌ను ఇంగ్లండ్ కు చెందిన ప్ర‌ముఖ సింగ‌ర్‌. అయితే కేవ‌లం పాట‌లు పాడ‌డం మాత్ర‌మే కాదు, మిక్ కు క్రికెట్ అంటే అమిత‌మైన ఆస‌క్తి. ఆయ‌న‌కు త‌న‌, ప‌ర అనే భేదం లేదు. ఏ రెండు దేశాల మ‌ధ్య జ‌రిగే ఎలాంటి మ్యాచ్‌నైనా ఆయ‌న చూస్తారు. ఇక అప్పుడ‌ప్పుడు క్రికెట్ మ్యాచ్‌ల‌ను దృష్టిలో ఉంచుకుని విరాళాలు కూడా ఇస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే రేప‌టి నుంచి ప్రారంభం కానున్న భార‌త్‌, ఇంగ్లండ్ 5వ టెస్ట్ మ్యాచ్‌ను కూడా మిక్ వీక్షించ‌నున్నాడు. అందులో భాగంగానే మిక్ ఓ ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టించాడు.

రేప‌టి నుంచి భారత్‌, ఇంగ్లండ్ ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జ‌ట్ల‌లో ఏ జ‌ట్టుకు చెందిన ఆట‌గాడైనా స‌రే సెంచ‌రీ చేసినా లేదంటే 5 వికెట్లు తీసినా 20వేల పౌండ్ల‌ను స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు విరాళంగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అంతేకాదు, క‌నీసం హాఫ్ సెంచ‌రీ చేసినా లేదంటే 3 వికెట్లు తీసినా 10వేల పౌండ్ల‌ను అయినా ఇస్తాన‌ని తెలిపాడు. నిజానికి మిక్ కు ఇలా విరాళం ఇవ్వ‌డం కొత్తేమీ కాదు. అయిన‌ప్ప‌టికీ అత‌ను ఇలా ప్ర‌క‌టించే స‌రికి ఇక అంద‌రి దృష్టి రేప‌టి మ్యాచ్‌పై ప‌డింది. మ‌రి ఈ మ్యాచ్‌లో ఏ జ‌ట్టుకు చెందిన ఆట‌గాడైనా మిక్ చెప్ప‌న‌ట్లు 50 లేదా 100 ప‌రుగులు, 3 లేదా 5 వికెట్లు తీస్తార లేదా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news