అభినందన్ తిరిగి విధుల్లో చేరొచ్చని బెంగళూరులో ఉన్న ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో ఆయన కూడా మళ్లీ విధుల్లో చేరడానికి సిద్ధమయ్యారు.
భారతదేశం గర్వించదగ్గ హీరో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ డ్యూటీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయన మళ్లీ విధుల్లో చేరనున్నారు. కాకపోతే ఆయన ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద కాకుండా.. పాకిస్థాన్ సరిహద్దుల్లోని వెస్ట్రన్ సెక్టార్ కు ఆయన్ను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా అభినందన్ ను అక్కడి నుంచి ఐఏఎస్ బదిలీ చేసినట్లు సమాచారం.
దీంతో త్వరలోనే ఆయన అక్కడ విధుల్లో చేరనున్నారు. అంతే కాదు.. అభినదన్ ను వీర చక్ర పురస్కారానికి కూడా ఐఏఎఫ్ ప్రతిపాదించిందట. యుద్ధ సమయాల్లో సైన్యానికి ఇచ్చే పురస్కారాల్లో ఇది మూడో అత్యున్నత పురస్కారం.
ఆయన తిరిగి విధుల్లో చేరొచ్చని బెంగళూరులో ఉన్న ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో ఆయన కూడా మళ్లీ విధుల్లో చేరడానికి సిద్ధమయ్యారు.
బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల దాడి తర్వాత ఫిబ్రవరి 27న మిగ్ 21 యుద్ధ విమానం ద్వారా పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ 16 ఫైటర్ జెట్ ను అభినందన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆసమయంలో మిగ్ 21 కూడా కూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన అభినందన్.. ప్యారాచూట్ సాయంతో పాకిస్థాన్ భూభాగంలో దిగారు. అయితే.. ఆయన పాకిస్థాన్ లో దిగగానే అక్కడి స్థానికులు ఆయనపై దాడి చేశారు. దీంతో అభినందన్ తన దగ్గర ఉన్న గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. తర్వాత అతడిని పాక్ సైనికులు నిర్భందించారు. దాదాపు 60 గంటల పాటు పాకిస్థాన్ సైన్యం చేతిలో ఉన్న అభినందన్ ను తర్వాత వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్.. భారత్ కు అప్పగించింది.
భారత్ కు చేరుకున్న తర్వాత అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహించి.. నెల రోజుల పాటు ఆయనకు సెలవులు ఇచ్చారు. విశ్రాంతి తీసుకోవాలని.. కుటుంబంతో గడపాలని ఐఏఎప్ తెలిపినప్పటికీ.. ఆయన తను పనిచేసే ఎయిర్ బేస్ లోనే ఉంటానన్నారు. తర్వాత ఇప్పుడు ఆయన్ను శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి వేరే చోటుకు బదిలీ చేశారు. దీంతో తిరిగి విధుల్లోకి అభినందన్ చేరనున్నారు.