అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్.. ఏ విషయంలోనైనా రికార్డే. ఆయన అపర కుబేరుడని తెలుసు కదా. ఇప్పుడు మరో విషయంలోనూ ఆయన రికార్డుకెక్కారు. అవి ఆయన విడాకులే. అవును.. ఆయన భార్య మెకంజీతో ఆయన విడాకులు తీసుకుంటున్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట.. చివరకు విడాకులు తీసుకోవడానికి సిద్ధమయిపోయింది.
అయితే.. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే.. వీళ్లు విడిపోయాక.. జెఫ్.. తన భార్యకు ఎంత భరణం చెల్లించనున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బెజోస్ ఆస్తుల విలువ సుమారు 137 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. అంటే 9.6 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. విడాకుల అనంతరం తన భార్య మెకంజీకి జెఫ్ సుమారు 69 బిలియర్ డాలర్లు భరణం కింద చెల్లించనున్నారట. అంతే.. తన ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తున్నారన్నమాట. దీంతో వీళ్ల విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా చరిత్రకెక్కాయి. అంతే కాదు.. ఒకవేళ ఆమెకు 69 బిలియన్ డాలర్లు ఇచ్చేస్తే.. మెకంజీ ప్రపంచంలో అత్యంత ధనవంతురాలుగా రికార్డుకెక్కుతుంది. ఏది ఏమైనా.. వీళ్ల విడాకులు ప్రపంచ కుబేరులను తారుమారు చేసేటట్టున్నాయి.