శృంగారం: కౌగిలింతలకి ఉన్న ప్రాధాన్యం గుర్తించారా?

ఇద్దరు భాగస్వాములు ఒకరినొకరు కౌగిలించుకుని చాలా రోజులయ్యిందంటే వారి బంధం బలహీనం అయినట్టే లెక్క. భౌతిక అవసరాల కోసం శృంగారం తప్ప కౌగిలింతల జోలికి వెళ్ళని వారు, శృంగారాన్ని కూడా ఆనందించలేరు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ పెరిగి, ముట్టుకోకుండా ఉండలేనిదిగా మారి, కౌగిలింతలకు చేరి, ఆ భద్రతలో, నమ్మకంలో ఇక నా సర్వం నువ్వే అనిపించి శృంగారానికి దారితీయడమేది మంచి అనుభవం.

అందుకే కౌగిలింతలకి గుర్తింపు ఇవ్వాలి. లేదంటే మీరు చేసే ప్రక్రియలో కృత్రిమత్వం చేరుకుని, కేవలం శరీర వేడిని చల్లార్చుకునే క్రియలా మారిపోతుంది. శృంగారంలోని ఆనందాల లోతులను అందుకోవడానికి కొంచెం రసికత్వం ఉండాలి. ఇంకొంచెం సృజనాత్మకత ఉండాలి. ఇంకా అన్నింటికన్నా మించి ప్రేమ ఉండాలి. వీటిల్లో ఏది తగ్గినా మీ అనుభవంలో ఏదో లోపం కలుగుతుంది.

ఆడ, మగా ఇద్దరినీ ఒక్కటి చేసే కౌగిలింతలు ఎన్ని పెరిగితే మీ బంధం అంత బాగుంటుంది. అలాగే మీ శృంగార జీవితం ఆనందంగా సాగుతుంది. మీ గుండె శబ్దం అవతలి వారికి వినబడ్డప్పుడు వారు మీలా, మీరు వారిలా మారి, ఒకరిలో ఒకరు ఒదిగి, ఇద్దరే ఒక్కరై, శృంగారంలో మధుర అనుభూతులను అందుకోవాలి.

అందుకే కౌగిలి కాసుల పేరు అంటారు. ముద్దు ముత్యపు సేరయితే కౌగిలి కాసుల పేరన్నమాట. వారం రోజుల పాటు మీ భాగస్వామికి దూరమై, ఆ తర్వాత కనిపించగానే చటుక్కున్న హత్తుకున్నప్పుడు, వారం రోజుల అలసట ఒక్కసారిగా దూరమైనట్లు అనిపిస్తుంది. అందుకే అప్పుడు కౌగిలింతలు, కావాల్సినప్పుడు ముద్దులు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీ వైవాహిక బంధం ఆనందంగా సాగుతుంది.