ప్రపంచంలోని పెద్ద పెద్ద నగరాలను సైతం వేధిస్తున్న సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. బారులు తీరిన వాహనాలు నిత్యం కనిపిస్తుంటాయి. వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం, అందుకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ రద్దీపై ఓ సర్వే నిర్వహించిన టామ్ టామ్ అనే సంస్థ అత్యంత రద్దీ నగరం బెంగళూరని తేల్చింది.
ట్రాఫిక్ ఇండెక్స్ పేరిట ఈ నివేదిక విడుదల కాగా, బెంగళూరు వాసులు సగటున ట్రాఫిక్ లో 71 శాతం అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారని పేర్కొంది. నగరంలో ఉండేవారు ఏడాదిలో సగటున 243 గంటలు ట్రాఫిక్ లో గడుపుతూ ఉన్నారని పేర్కొంది. ఇక టాప్ 10 అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో పలు భారత నగరాలు చోటు సంపాదించాయి. ముంబై నాలుగో స్థానంలో, పుణె 5వ స్థానంలో, ఢిల్లీ 8వ స్థానంలో ఉన్నాయి. వీటితో పాటు టాప్ టెన్ లో మనీలా, బొగోటా, మాస్కో, లిమా, ఇస్తాంబుల్, జకార్తా నగరాలున్నాయి.