దేశవ్యాప్తంగా ఉల్లి ధరల ఘాటు మామూలుగా లేదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కేజీ ఉల్లి రేటు రు.200 దాటేసింది. ప్రభుత్వాలు సబ్సిడీపై ఉల్లి అందించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేటు మాత్రం ఆగడం లేదు. చివరకు పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు ఉల్లిని తీసుకు వెళ్లి గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులోని తంజావూరులో మొబైల్ ఫోన్ కొంటే కిలో ఉల్లి ఉచితంగా అందిస్తామనే ప్రకటన ఆసక్తి రేపుతోంది.
పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉల్లి సాగు తీవ్రంగా దెబ్బతింది. ఇక దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు నిన్నటి వరకు కేజీ రు.15-20 వరకు ఉన్న ఉల్లి రేటు ఇప్పుడు కిలో ధర రూ.150, చిన్న ఉల్లి రూ.200 పలుకుతోంది. ఉల్లి రేటు రోజు రోజుకు చుక్కలను అంటుతోన్న నేపథ్యంలో చేలో నుంచే ఉల్లి పంటను దొంగతనం చేస్తుండడంతో చివరకు రైతులు రాత్రి వేళల్లో ఉల్లి పంటకు కాపలా కాస్తున్నారు.
మరి దేశవ్యాప్తంగా ఉల్లి హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఉల్లిని తంజావూరులో ఓ వ్యాపారి ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. పట్టుకోట సమీపం సెంబలూరు గ్రామానికి చెందిన శరవణకుమార్ (35) ఎనిమిదేళ్లుగా పట్టుకోట మెయిన్‌రోడ్‌లో మొబైల్ షాపును నడుపుతున్నాడు. వినియోగ దారులను ఆకట్టుకొనేలా మొబైల్ ఫోన్ కొంటే కిలో ఉల్లి ఉచితంగా అందిస్తామని శరవణకుమార్ దుకాణం ముందు ఏర్పాటుచేసిన ప్రకటన ప్రజల్లో ఆసక్తి రేపుతోంది.
ఇప్పుడు ఈ ప్రకటనకు మంచి స్పందన కూడా వస్తోందని శరవణ కుమార్ చెప్పాడు. తొలి రోజే ఈ ప్రకటన చూసి 8 మంది మొబైల్ ఫోన్లు కొన్నారని కూడా అతడు చెపుతున్నాడు. ఉల్లి రేటు దిగిరాకపోతే మరి ఉల్లి ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.