వేరొకరి టికెట్‌తో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా..? రైల్వే రూల్స్‌ ఎలా ఉన్నాయి..?

-

ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాక.. తీరా వెళ్లాల్సిన టైమ్‌ వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల మన ఆ జర్నీ చేయడం కుదరదు. ఇంట్లో ఎవరైనా అదే టికెట్‌ మీద ప్రయాణించవచ్చా అనే సందేహం కలగవచ్చు. వయసు ఒకటే అయితే వెళ్లొచ్చు ఏం కాదు అదే జండర్‌ తేడా ఉన్నా, ఏజ్‌లో మరీ వ్యత్యాసం ఉన్నా టీటీ గుర్తుకుపట్టేస్తాడు అప్పుడు సమస్య అవుతుందని మనం అనుకుంటాం. కానీ అసలు ట్రైన్‌లో ఒకరి టికెట్‌ మీద మరొకరు వెళ్లొచ్చా? వెళ్తే ఏం అవుతుంది..? దీనికి సంబంధించి రైల్వే నిబంధనలు ఎలా ఉన్నాయి..?

రైల్వేల టిక్కెట్లు, బోర్డింగ్‌కు సంబంధించిన నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తోంది రైల్వే శాఖ. ట్రైన్‌లో ఎవరి పేరు మీద బుక్ చేసిన టికెట్‌పై వాళ్లే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక ప్రయాణికుడి టికెట్‌పై మరోకరు ప్రయాణించడానికి వీళ్లేదు. టీసీకి పట్టుబడితే.. టిక్కెట్ లేని ప్రయాణికుడిగా పరిగణిస్తారు. భారీ జరిమానాలు విధించవచ్చు. లేదా రైల్వే చట్టం 1989 ప్రకారం.. జరిమానాతో జైలు శిక్ష కూడా విధించవచ్చు. ప్రయాణ తరగతి, దూరం, నేరం ఫ్రీక్వెన్సీని బట్టి ఫైన్ విధించే అవకాశం కూడా ఉంటుంది.

మీకు అవసరం ఉండి.. మీరు బుక్ చేసుకున్న టికెట్‌పై వేరే వాళ్లను పంపిస్తే ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తప్పుడు ప్రవర్తన కింద గుర్తించి రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. మీ జర్నీ ప్లాన్‌లో ఏదైనా మార్పు లేదా ఎమర్జెన్సీ ప్రయాణం ఉన్నా.. మీ పేరుపై ఉన్న టికెట్‌ను ఇతరులకు ఇవ్వవద్దు. మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోండి. లేదంటే రీషెడ్యూల్ కోసం రైల్వే అధికారులను సంప్రదించండి.

అధికారిక టికెట్‌తో ప్రయాణించే వ్యక్తులను గుర్తించడం టికెట్ చెకింగ్ స్టాఫ్ (టీటీఈ) బాధ్యత. రైలు ప్రయాణ సమయంలో ప్రతి వ్యక్తి వద్దా టికెట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇతరుల పేర్లతో ప్రయాణించే వ్యక్తులను టీటీఈ గుర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటారు. జరిమానాతో పాటు ఛార్జీ డబ్బులు కూడా వసూలు చేస్తారు. ట్రైన్ తరువాత చేరుకునే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసి తదుపరి చర్యలకు సిఫార్సు చేయవచ్చు. ఇదంతా దొరికితినే.. దొరకనంత వరకూ అందరూ దొరలే.. అలా అనీ ఇలాంటి పనులు చేసి అనవసరంగా రిస్క్‌లో పడకండే..!

Read more RELATED
Recommended to you

Latest news