కరోనా ఎఫెక్ట్‌: ఆటాడుకుందాం రా.. అంటున్న కేంద్రమంత్రి

-

క‌రోనా వైర‌స్ కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాల్లో పాజిటివ్‌ కేసులతోపాటు మరణాలు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే ఎప్పుడూ విధులతో బిజీగా ఉండి, ఇప్పుడు ఏ పని లేకపోవడంతో బోర్‌ ఫీలయ్యే వారి కోసం కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఒక మంచి ఐడియా చేశారు.

అదేంటంటే.. రోప్‌ స్కిప్పింగ్‌ ఆడటం! అవును దేశంలోని యువ‌తీయువ‌కుల‌ంతా రోజూ రోప్‌ స్కిప్పింగ్‌ ఆడాలని కేంద్రమంత్రి సూచించారు. ఇలా రోప్‌ స్కిప్పింగ్‌ ఆడటం ద్వారా ఫిట్‌ కార్యక్రమాన్ని ప్రమోట్‌ చేయాలని ఆయన కోరారు. అంతేకాదు తన సూచనను సాధ్యమైనంత మందికి షేర్‌ చేయాలని కూడా కిరెన్‌ రిజిజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను రోప్‌ స్కిప్పింగ్‌ చేస్తున్న ఒక వీడియోను కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు.

ఇదిలావుంటే లాక్‌డౌన్‌ కారణంగా లభించిన ఖాళీ సమయాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి సలహా ఇచ్చారు. ఈ ఖాళీ సమయంలో వీలైనన్ని మంచి పనులు చేయాలని ఆయన సూచించారు. రోడ్లపైకి వెళ్లే అవకాశం లేదు కదా అని ఎవరు కూడా ఫిట్‌నెస్‌ కసరత్తులు మరువద్దని, ఇంట్లోనే వీలును బట్టి వ్యాయామం చేయాలని కోరారు. ఈ వ్యాయామంలో భాగంగా కొన్ని నిమిషాలైన రోప్‌ స్కిప్పింగ్‌ చేయాలని ఆయన పేర్కొన్నారు. మ‌రి ఆల‌స్యం దేనికి, మంత్రిగారు చెప్పిన‌ట్లు దేశంలోని యువ‌తీ యువ‌కులంతా రోప్ స్కిప్పింగ్ చేయండి.. ఫిట్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రమోట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news