కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఏ దేశంలో చూసినా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్న దాఖలాలు లేవు. మన దేశంలో ఈ వైరస్ తీవ్రంగానే ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే దాదాపు 600 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. ఇది మంచి నిర్ణయమే అయినా కొందరు బడుగు జీవులను మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.
బతుకుదెరువు కోసం సొంత ఊళ్లను విడిచి నగరాలకు వచ్చిన నిరుపేదలు పట్నాల్లో చిక్కుకుపోయారు. రెక్కాడితేగానీ డొక్కాడని జీవితాలు గడుపుతున్న ఇలాంటి వారంతా పనిలేనిదే పట్నాల్లో బతికే స్థోమతలేక, పల్లెలకు తిరిగే వెళ్లే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకికి చెందిన కొందరు కూలీలు సైతం ఇలాగే బతుకుదెరువు కోసం లక్నోకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు.
బారాబంకికి చెందిన కొంతమంది కూలీలు లక్నోలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. పొద్దంతా అక్కడే పనిచేసి అక్కడే నింద్రించేవారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ విధించడంతో స్టీల్ ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటిదాకా వాళ్లతో పనిచేయించుకున్న యాజమాన్యం వెళ్లిపొమ్మని గెంటేసింది. దీంతో నిలువ నీడ లేకుండా అయిన ఆ కూలీలకు సొంతూరికి వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అందుకే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే ఆలస్యం.. మంగళవారం మధ్యాహ్నం మండుటెండలో తమ ప్రయాణం మొదలుపెట్టారు. అడుడగునా పోలీసు పహారా ఉంటుందని తెలిసినా బ్యాగుల్లో తినడానికి కొన్ని బిస్కట్ ప్యాకెట్లు, తాగడానికి మంచినీళ్లు పెట్టుకుని బయలుదేరారు. బారాబంకికి చేరుకోవడానికి తమకు 36 గంటలు పడుతుందన్న కూలీలు.. ఎక్కడా పోలీసులు అడ్డుకోకపోతే గురువారం ఉదయానికి తమ గమ్యస్థానం చేరుకుంటామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా ఇలా రోడ్లపైకి రావడం తప్పు కదా అంటే.. ‘కంపెనీ నుంచి యాజమాన్యం వెళ్లగొట్టింది! రోడ్లపైన పోలీసులు ఉండనివ్వరు! మరి మేం ఎక్కడ బతుకాలి?’ అని అవదేశ్ కుమార్ అనే 20 ఏండ్ల కూలీ ప్రశ్నించాడు. లాక్‌డౌన్ ను లెక్కచేయొద్దన్నది తమ ఉద్దేశం కాదని, లక్నోలో నిలువనీడ లేకుండా అయినందున సొంతూరికి వెళ్లడం తప్ప తమకు వేరే మార్గం లేదని అవదేశ్ చెప్పాడు.