సృష్టిలో జీవుల చావు, పుట్టుకలు అత్యంత సహజం. ఆయువు తీరిన జీవి చనిపోక తప్పదు. కొత్త జీవి జన్మించక తప్పదు. మనుషులకైనా, ఇతర జీవాలకైనా.. చావు, పుట్టుకలు అనివార్యం. కాకపోతే ఒక జీవి ముందు, ఒక జీవి వెనుక.. అంతే.. అయితే చనిపోయిన మనుషులను తిరిగి బతికించడం సాధ్యమవుతుందా..? అంటే అందుకు కాదనే ఎవరైనా సమాధానం చెబుతారు. అయితే మీకు తెలుసా..? కొన్ని అరుదైన సందర్భాల్లో.. చనిపోయిన వ్యక్తులు కూడా తిరిగి బతుకుతారట. దీన్నే లాజరస్ సిండ్రోమ్ (Lazarus Syndrome) అంటారు.
ఏసుక్రీస్తు జీవిత చరిత్ర చదివిన చాలా మందికి.. లాజరస్ అనే వ్యక్తి గురించి తెలిసే ఉంటుంది. అతను చనిపోయాక 4 రోజులకు తిరిగి బతికి వస్తాడు. జీసస్ అతన్ని బతికిస్తాడు. అందుకనే చనిపోయిన వ్యక్తులు తిరిగి బతికి వస్తే.. దాన్ని లాజరస్ సిండ్రోమ్ అని పిలవడం మొదలు పెట్టారు. చనిపోయిన లాజరస్ తిరిగి బతికివచ్చినట్లుగానే ఇతరులు వస్తే.. అప్పుడు దాన్ని లాజరస్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అయితే ఇలాంటి సంఘటనలు మన నిజ జీవితంలోనూ కొన్ని గతంలో జరిగాయి.
2001లో 66 ఏళ్ల ఓ వృద్ధుడికి కార్డియాక్ అరెస్ట్ వల్ల గుండె ఆగిపోయింది. వైద్యులు సీపీఆర్, డీఫైబ్రిలేషన్ చేసినా ఫలితం లేదు. దీంతో అతను చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. అయితే ఆశ్చర్యంగా 17 నిమిషాల తరువాత అతను బతికే ఉన్నట్లు వైద్యులకు తెలిసింది. దీంతో వారు వెంటనే అతనికి చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి అతన్ని బయట పడేశారు. అలాగే 2014లోనూ మిసిసిపిలో ఓ 78 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు నిర్దారించారు. అతనిలో వైద్యులకు పల్స్ దొరకలేదు. అయితే అతన్ని పోస్టుమార్టం గదిలో ఉంచగా… మరుసటి రోజు బతికే ఉన్నట్లు గుర్తించి.. చికిత్స అందించారు.
కాగా 1982లో మొదటి సారిగా ఇలాంటి కేసులు బయట పడేసరికి అప్పటి నుంచి దీన్ని లాజరస్ సిండ్రోమ్ అని పిలుస్తూ వస్తున్నారు. 2007లో సైంటిస్టులు చేసిన అధ్యయనాల ప్రకారం.. కార్డియాక్ అరెస్ట్ వల్ల గుండె ఆగిపోయిన వారిలో ఒక్కోసారి దాదాపుగా 10 నిమిషాల తరువాత మళ్లీ పల్స్ ప్రారంభమై, నాడీ వ్యవస్థ పనిచేస్తుందని తేల్చారు. అందువల్ల దీన్ని లాజరస్ సిండ్రోమ్‌గా వైద్యులు గుర్తించారు..!