ఈ కారు పార్క్ చేయ‌డం ఏంట్రా బాబు.. చూస్తే ప‌డిప‌డి న‌వ్వుకుంటారు..!

కారున్న చాలా మందిని వేధించే ప్రశ్న. అసలు కారుకు పార్కింగ్ ఎలా అని. ఈ కారణం వల్లే చాలా మంది కారు కొనకుండా ఆగిపోతుంటారు. కారులో తిరగాలని ఎంతలా ఉన్నా… కూడా పార్కింగ్ స్థలం కోసం ఆలోచించే తమ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. కారు డ్రైవింగ్ నేర్చుకున్న వారు కారును పార్కింగ్ చేయడం నేర్చుకోకపోతే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఇలా పార్కింగ్ చేయడానికి అవస్థలు పడుతున్న యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన వ్యక్తి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకీ ఏం జరిగిందంటే..

యునైటెడ్ కింగ్ డమ్ లో నివాసం ఉండే అండ్రాయ్ డాల్క్ అనే వ్యక్తి తాను తీసిన ఓ ఫన్నీ కారు పార్కింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఓ రోజు తాను సరదాగా ఇంటి వద్ద కూర్చుని ఉండగా… పక్కన ఉన్న అపార్ట్ మెంట్ లో ఓ వ్యక్తి కారు పార్క్ చేసేందుకు అవస్థలు పడడం చూసిన డాల్క్ అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆ వ్యక్తికి కారు పార్క్ చేసేంత స్థలం ఉన్నా కూడా పార్క్ చేసేందుకు నానా తంటాలు పడ్డాడు.

ముందుకెళ్తూ… వెనక్కి వస్తూ… ఇలా ఎనిమిది నిముషాల పాటు కారు పార్క్ చేసేందుకు తీవ్రంగా అవస్థలు పడ్డాడు. ఎనిమిది నిమిషాల పాటు కష్టపడి చివరికి విజయవంతంగా కారును పార్క్ చేశాడు. ఇదంతా వీడియో తీసిన డాల్క్ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో నవ్వుతూ వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అసలు అతడికి కారు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది అని కొందరు కామెంట్ చేయడం గమనార్హం. ఇలా ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో నిలిచింది.