త్వరలో మారనున్న ఇండియా పేరు.. ఇప్పటి వరకూ పేర్లు మార్చుకున్న దేశాలు ఇవే

-

ఇండియాను భారత్‌ అని కూడా అంటాం. కానీ అధికారికంగా మారుస్తారని ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకూ పేర్లు మార్చుకున్న దేశాలు ఏంటో, వాటికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

దేశం పేరు మార్పు అనేది గుర్తింపు, సార్వభౌమాధికారం, చారిత్రక మార్పును సూచిస్తుంది. మనదేశానికి ఇండియా పేరును అధికారికంగా భారత్‌గా మారుస్తారని ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది సమాచారం.

సిలోన్ – శ్రీలంక

భారత్‌కు సమీపంలోని ద్వీప దేశం సిలోన్, 1972లో తన పేరును శ్రీలంకగా మార్చుకుంది. పోర్చుగీసు, బ్రిటిష్ పాలనలో ఈ ద్వీప దేశాన్ని సిలోన్ అని పిలిచేవారు. అయితే బహుళ సాంస్కృతిక గుర్తింపు లక్ష్యంగా, బ్రిటిష్ వలస విధానాన్ని రూపుమాపడానికి పేరు మార్చి రిప్లబిక్ దేశంగా ప్రకటించుకున్నారు. శ్రీలంక అంటే సింహళీ భాషలో ప్రకాశవంతమైన భూమి అని అర్థం. అందుకు తగ్గట్టు ఈ దేశం ప్రకృతి అందాలకు నిలయంగా ఉంటుంది.

తూర్పు పాకిస్తాన్ – బంగ్లాదేశ్

1971లో జరిగిన యుద్ధం తరువాత పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి స్వాతంత్ర్యాన్ని పొందింది. దీని ఫలితంగా బంగ్లాదేశ్ అనే పేరుతో కొత్త దేశం ఆవిర్భవించింది. పేరు, హోదాలో మార్పు అనేది రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక, భాషా, రాజకీయ వ్యత్యాసాలను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ముగింపు పలికింది.

రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా – నార్త్ మాసిడోనియా

రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా అనే దేశం పేరును నార్త్ మాసిడోనియాగా మార్చారు. ఈ పేరు మార్పు ఇటీవల 2019లో చోటుచేసుకుంది. దీంతో గ్రీస్‌తో చాలా కాలంగా ఉన్న వివాదం పరిష్కారమైంది. మాసిడోనియా అనే పేరును ఉపయోగించడంపై గ్రీస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే అదే పేరుతో ఆ దేశంలో ఒక ప్రాంతం కూడా ఉంది. దీంతో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పేరును నార్త్ మాసిడోనియాగా మార్చారు.

బర్మా – మయన్మార్

ఆగ్నేయాసియా దేశం బర్మా పేరును 1989లో మయన్మార్‌గా మార్చారు. ఆ సమయంలో బర్మా మిలటరీ పాలనలో ఉంది. పేరు మార్పు వల్ల మయన్మార్ అంతర్జాతీయ వివాదాలు, వ్యతిరేకతను ఎదుర్కొంది. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య పరివర్తన లేకపోవడంపై ఆందోళనల వ్యక్తం చేస్తూ అమెరికా సహా కొన్ని దేశాలు ఆ దేశాన్ని బర్మాగానే ఉంచాలని సూచించాయి.

చెకోస్లోవేకియా- చెక్ రిపబ్లిక్, స్లోవేకియా

1993లో చెకోస్లోవేకియా దేశం విడిపోయి రెండు వేర్వేరు దేశాలు ఏర్పడ్డాయి. ఒకటి చెక్ రిపబ్లిక్ కాగా, మరోటి స్లోవేకియా దేశంగా ఏర్పడింది. ఈ శాంతియుత విభజన కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికింది. చెక్స్, స్లోవాక్స్ అనే రెండు జాతుల మధ్య స్వయంప్రతిపత్తి, స్వీయ-నిర్ణయాధికారం కోసం ఈ రెండు దేశాలు ఏర్పడ్డాయి.

సియామ్ – థాయిలాండ్

ఆగ్నేయ ఆసియా దేశమైన సియామ్ పేరును 1939లో థాయిలాండ్‌గా మార్చారు. ఆగ్నేయాసియాలో పెరుగుతున్న పాశ్చాత్య వలసవాద ప్రభావం నేపథ్యంలో దేశం ఐక్యత, గుర్తింపును నొక్కిచెప్పడం లక్ష్యంగా దేశం పేరును మార్చారు. థాయిలాండ్ అంటే స్వేచ్ఛాభూమి అని అర్థం. దేశ స్వాతంత్ర్యం, థాయ్ ప్రజల జాతీయ భావాన్ని నొక్కి చెప్పడానికి ఈ పేరు ఎంపిక చేశారు.

జైర్- డెమోక్రటిక్ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగో

రాజకీయ తిరుగుబాట్లు, వివాదాలతో సతమతమవుతున్న జైర్ దేశం 1997లో పేరును మార్చుకుంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR కాంగో)గా అవతరించింది. మూడు దశాబ్దాలకు పైగా నియంతలా పాలించిన మొబుటు సేసే సెకో పాలన నుంచి దేశాన్ని దూరం చేసేందుకు ఈ దేశం పేరును మార్చుకుంది. కొత్తపేరు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ప్రాధాన్యతను నొక్కి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news