ఆంధ్రా కశ్మీర్.. చూడాలంటే.. ఛలో లంబసింగి

-

దట్టంగా కమ్ముకున్న పొగమంచు. ఓవైపు కురుస్తున్న మంచు తుంపరులు.. ఈడ్చికొట్టే అతిచల్లని గాలులు. ఒకవైపు వలస పూల సోయగాలు. మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు. అంతా ప్రకృతి సోయగాల మయం. వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవన్నీ చూడాలంటే ఏ స్విట్జర్లాండ్‌కో లేదంటే కాశ్మీర్‌కో వెళ్లాలనుకుంటున్నారా? అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది. అందుకే దీనికి ముద్దుగా కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా లేదా ఆంధ్రా ఊటీగా పిలుస్తారు.

మన్యం అందాలు అనగానే అందరికీ అరకులోయ గుర్తుకువస్తుంది. లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. లంబసింగి ఘాట్‌రోడ్‌లో కాఫీ తోటలు విస్తారంగా ఉన్నాయి. లంబసింగి చేరుకునే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది. దీనికి అరకిలోమీటరు దిగువున జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. అక్కడికి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంది.


లంబసింగి ఎక్కడ
విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది ఈ లంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కి.మీ. దూరంలో ఉంది. నాలుగేండ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి. శీతాకాలంలో సున్నా డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా నమోదవుతుంది. మిగతా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతల నమోదవుతాయి.

పర్యాటకులతో సందడే సందడి
ఎక్కడెక్కడి ప్రకృతి ప్రేమికులు లంబసింగి దారిపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే పర్యాటకులతో జాతరని తలపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. కొంతమంది పర్యాటకులు కట్టెలు, కిరోసిన్ వెంట తెచ్చుకొని మీర చలిమంటలు వేసుకుంటారు. యువతీ యువకులు ఆ నెగళ్ల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు. ఉదయం ఆరు గంటల నుంచి పర్యాటకులు తమ సెల్‌ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటూ హడావుడి చేస్తారు.

సుదూర ప్రాంతాల నుంచి
విశాఖ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు లంబసింగికి తరలిరావడంతో ఈ మార్గంలో రహదారులు కిక్కిరిసిపోతాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పర్యాటకులు వచ్చారంటే ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

కాశ్మీరాన్ని తలపించే లోయలు
కాశ్మీరాన్ని లపించే లోయలు ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు, కశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. మన్యం ఏరియాలో ఉంది కనుక కొండలు, అడవులు దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇరువైపులా లోయలు మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదరకంగా ఉంటుంది.

అందాలను చూసి కొత్త ఉత్సాహం
ఎన్నో ములుపులు తిరుగుతూ సాగే లంబసింగి ప్రయాణం రసవత్తరంగా ఉంటుంది. కాఫీ తోటలు, పసుపు రంగులో కనిపించే వలిసెపూల తోటలు, తాజంగి రిజర్వాయర్, వాతావరణం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు

దక్షిణ భారతదేశంలో
దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా శీతాకాలంలో లంబసింగిలో మంచు వర్షం కురుస్తుంది. ప్రతిరోజూ ఉదయం 6 అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకు దర్శనం ఇస్తాడు. వేసవిలో మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు. లంబసింగిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు సన్నబగిపోతాడు. సాయంత్రం 5 నుంచి 6 అయ్యేసరికి చలి ప్రారంభమవుతుంది.

యాపిల్ సాగు, కాఫీ తోటల పెంపకం
యాపిల్ సాగు కాఫీ తోటల పెంపకం బ్రిటీష్ వారి కాలం నుంచే ఉంది. ఇక్కడి కాఫీ గింజలను మిరియాలను అమెరికా, బ్రిటన్, తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అమెరికాలోని ప్లోరిడా తరహా వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో యాపిల్ సాగ చేయాలన్న ఆలోచన పరిశీలనలో ఉంది.

చూడదగ్గ ఇతర ఆకర్షణలు
తాజంగి రిజర్వాయర్ వద్ద పర్యాటక శాఖ తాజాగా బోట్ షికారును ఏర్పాటుచేశారు. చక్కటి అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో 5 కి.మీ. దూరంలో ఉన్న బోడకొండమ్మ దేవాలయం వద్ద ఒక జలపాతం కూడా కనిపించింది. దేవాలయం వద్ద కనిపించింది. కాబట్టి బోండకొండమ్మ జలపాతం అని పేరు పెట్టారు. అలాగే 40 కి.మీ. ల దూరంలో కొత్తపల్లి వాటర్‌ఫాల్స్ 75 కి.మీ.ల దూరంలో ధారకొండ వాటర్ ఫాల్స్ చూడదగ్గవి.

ఎలా చేరుకోవాలి ?
లంబసింగికి చేరువలో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ (106 కి.మీ), వైజాగ్ రైల్వే స్టేషన్ (114 కి.మీ.). నర్సీపట్నం రైల్వేస్టేషన్‌లు ఉనాయి. ప్రభుత్వ బస్సులలో వచ్చేవారు నర్సీపట్నం, వైజాగ్, చింతపల్లి (19 కి.మీ) తదితర ప్రాంతాల నుంచి బస్సులలో రావొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news