వర్జిన్ టెస్ట్ ఫెయిల్ అయిందని వధువుకు రూ.10 లక్షల జరిమానా

-

ప్రపంచం ఎంత ముందుకు దూసుకెళ్తున్నా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢాచారాలతో వెనుకబడే ఉన్నాయి. మూఢనమ్మకాలతో ఇంకా చీకట్లో మగ్గుతూనే ఉన్నాయి. వీరి ఆచారాల వల్ల కొందరు అమాయకుల జీవితాలు బలవుతున్నాయి. ఇలాంటి సంఘటనే రాజస్థాన్​లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాలోని బాగోర్​లో చోటుచేసుకుంది.

పెళ్లి చేసే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారని తెలుసు. కానీ వివాహం జరిపించిన తర్వాత వధువుకు కన్యత్వ పరీక్ష పెడతారని తెలుసా. ఇలాంటి దుర్మార్గమైన మూఢాచారం రాజస్థాన్​లో ఉంది. వర్జిన్ టెస్ట్(కన్యత్వ పరీక్ష)లో ఫెయిల్ అయిందని 24 ఏళ్ల నవ వధువును అత్తింటివారు చితకబాదారు. అంతటితో ఆగకుండా ఇంటినుంచి వెళ్లగొట్టారు. ఇది సరిపోదంటూ పంచాయితీ పెట్టి వధువు కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించేలా చేశారు.

మే 11న బాగోర్‌కు చెందిన వ్యక్తితో బాధితురాలికి వివాహమైంది. ఈ ప్రాంతంలో నూతన వధువుకు వర్జిన్ టెస్ట్ చేసే దురాచారం ఉంది. దీన్ని కుకుడీ ఆచారమని అంటారు. ఇందులో బాధితురాలు విఫలమైంది. ఆమె మే 31న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ ముందు నిలబెట్టారు.ఇందులో బాధిత మహిళ.. పెళ్లికాకముందు తనపై పొరుగింటి యువకుడు అత్యాచారం చేశాడని పేర్కొంది. ఈ సంఘటనపై తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని కూడా పెద్దల ముందు మొరపెట్టుకుంది. అయినా భర్త కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సిందేనని పెద్దలు తీర్పిచ్చారు. చేసేదేం లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. భర్త, అత్త, మామ, ఇతరులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news