ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఇకపై రైలు ప్రయాణంలో ఉండగా ప్రయాణికుల ఇండ్లలో చోరీ జరిగితే అందుకు ఐఆర్‌సీటీసీ పరిహారం చెల్లిస్తుంది. రూ.1 లక్ష వరకు ఇందుకుగాను రైల్వే ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది. ప్రయాణికులు రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ఇండ్లలో చోరీ జరిగితే ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఐఆర్‌సీటీసీ పరిహారం అందిస్తుంది.
అయితే ప్రస్తుతానికి ఈ సదుపాయం కేవలం తేజస్ రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన రైళ్లలో ఈ సదుపాయాన్ని అందించడంపై ఐఆర్‌సీటీసీ స్పష్టతనివ్వలేదు. కాగా కరోనా నేపథ్యంలో ప్రస్తుతం తేజస్ రైళ్లను నడపడం లేదు. కానీ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి తేజస్ రైళ్లను మళ్లీ నడిపించనున్నారు. అందుకే ఐఆర్‌సీటీసీ ఈ ప్రకటన చేసింది.
కాగా లక్నో నుంచి న్యూఢిల్లీ వరకు తేజస్ ట్రెయిన్లు నడవనున్నాయి. అక్టోబర్‌లో లక్నో – ఢిల్లీ, ముంబై – అహ్మదాబాద్ తేజస్ రైళ్లను పండుగల సందర్బంగా నడిపించారు. కానీ నవంబర్ నెలలో వీటిని నిలిపివేశారు. ఈ క్రమంలో ఈ రైళ్లు త్వరలో మళ్లీ ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.