లాక్డౌన్ లో ఆన్ లైన్ స్నేహాలు.. జాగ్ర‌త్త సుమీ..!

కరోనా కారణంగా ఆన్ లైన్ డేటింగ్ యాప్ ల వాడకం విరివిగా పెరిగింది. చెప్పాలి నువ్వే చెప్పాలి.. ట‌మాట కూర‌, పాల కూర ప‌ప్పంటూ ఆన్‌లైన్ ముచ్చ‌ట్లు పెట్ట‌డం బాగా పెరిగిపోయింది. బయటకి వెళ్ళే పని లేదు కాబట్టి ఇంట్లో ఉండే ఆన్ లైన్ లో చిట్ చాట్ చేస్తున్నారు. ఐతే దీనివల్ల చాలా అనర్థాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అపోజిట్ సెక్స్ తో ఫ్రెండ్ షిప్ చేసేవారు ఇలాంటి ఇబ్బందులకి గురవుతున్నారు. సరదాగా కాలక్షేపం చేద్దామనుకున్న వ్యవహారం కాస్తా, ఆ తర్వాత రకరకాల పర్యావసానాలకి దారి తీస్తుంది.

ఆన్ లైన్ లో బయట వ్యక్తి ఎవరో తెలీదు. కేవలం సోషల్ మీడియాలో పెట్టిన్ పోస్ట్, ఫోటో చూసి ఛాట్ చేయడం మొదలెడతారు. సోషల్ మీడియాలో పెట్టిన ప్రతీదీ నిజమనుకుంటే పొరపాటే. ఎంతో మంది ఎన్నో సార్లు ఇలానే మోసపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోకపోవడమే బెటర్. అవతలి వ్యక్తి ఎలాంటి వాడనేది సోషల్ మీడియా ద్వారా ఒక అంచనా వేయలేం. పక్కనున్న వారే పది సార్లు పది రకాలుగా కనిపిస్తుంటే ఎక్కడో ఉన్న ఎవరో జీవితాన్ని మీరెలా అంచనా వేస్తారు?

అందుకే వాళ్ళ గురించి మీకేమీ తెలియదు. సో మీరేమీ చెప్పవద్దు. ముఖ్యంగా డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ స్నేహాల్లో డబ్బులు అడిగి, ఆ తర్వాత పత్తా లేకుండా పారిపోయే వాళ్ళు చాలా ఎక్కువ. అసలే మహమ్మారి. ఈ టైమ్ లో ఇలా మోసపోకుండా చూసుకోండి. మీ వ్యక్తిగత ఫోటోలు ఆన్ లైన్ లో మీ ఫ్రెండ్ తో పంచుకోవద్దు. కొన్ని రోజుల తర్వాత అది మీ పాలిట శాపంగా మారే అవకాశం ఉంటుంది.

మొత్తానికి చెప్పేది ఏంటంటే, ఆన్ లైన్ లో స్నేహం ఎప్పటికీ మంచిది కాదు. దూరపు కొండలు నునుపు మాదిరిగా అదీ అంతే. అందుకే మీ నిజమైన స్నేహితులతో మాట్లాడండి. వారి బాధలు వినండి. మీ గల్లీలో వాళ్ళని పలకరించండి. మీ బంధువులు, చుట్టాలు.. మీ మంచి కోరేవారు చాలా మంది ఉంటారు. లాక్డౌన్ కారణంగా పెరుగుతున్న ఒత్తిడి నుండి బయటపడడానికి కొత్త అలవాట్లని అలవర్చుకోండి.