ఓర్ని..! భార్యకు తెల్లజుట్టు వచ్చిందని రెండో పెళ్లికి రెడీ అయిన భర్త..

తెల్లజుట్టు అంటే వృద్ధాప్యంలోనే వస్తుందని అనే రోజులు పోయాయి.. స్కూల్‌కు వెళ్లే వయసునుంచే చాలామంది జుట్టు తెల్లబడిపోతుంది. పోషకాహారలోపం, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల త్వరగా తెల్లజుట్టు వస్తుంది. వీటని కవర్ చేసుకోవడానికి మనం ఏవేవో మార్గాలు ఎంచుకుంటాం.. కానీ భార్యకు తెల్లజుట్టు వచ్చిందని ఆ భర్త ఏకంగా రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు..! వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ.! కానీ ఇది నిజమండీ..!
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సారణ్ జిల్లాలోని సహజిత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బబితా దేవికి బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లౌవా కాలా నివాసి పంకజ్ సాహ్‌తో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే ఇంటి పెద్దలు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే పెళ్లైన రెండేళ్ల తర్వాత భార్యకున్న తెల్ల జుట్టును చూసిన భర్త పంకజ్ ఇంట్లో గొడవ చేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీనిపై సహజిత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బబిత ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు.
అయితే తాజాగా పంకజ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. స్థానికులు బబితకు ఈ విషయం తెలియజేయడంతో తన తండ్రితో కలసి ఆలయానికి చేరుకుని పెళ్లి ఆపి రచ్చ చేసింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భార్యకు తెల్లజుట్టు వచ్చిందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా బాస్‌ అంటూ నెజిజన్లు కమెంట్‌ చేస్తున్నారు. కొందరైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కారణాలో బంధాలు తెంచుకుంటే.. మన దేశంలో కాదు కాదు.. ప్రపంచంలోనే ఎవ్వరూ కలిసి ఉండరేమో కదా..!