ఇండియాలో అత్యంత వేగంగా నడిచే రైలు శతాబ్ది అని అందరికీ తెలిసిందే. కానీ.. అది ఒకప్పటి మాట. ఎందుకంటే.. ఇప్పుడు అత్యంత వేగంగా నడిచే రైలు ట్రెయిన్ 18. అవును.. ఇంజన్ లేని ట్రెయిన్ ఇది. ఇటీవలే దీన్ని టెస్టింగ్ కూడా చేశారు. టెస్ట్ రైడ్ లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది ఆ రైలు. అందుకే అత్యంత వేగంగా నడిచే రైలుగా ట్రెయిన్ 18ను అఫీషియల్ గా కన్ఫమ్ చేస్తూ… దాని టెస్ట్ రైడ్ కు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి పియుష్ గోయల్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.
ఈ ట్రెయిన్ ను డిసెంబర్ 29న ప్రధాని మోదీ.. వారణాసిలో ప్రారంభించనున్నారు. వారణాసి, న్యూఢిల్లీ మధ్య ఈ రైలు నడవనుంది. అన్నీ ఏసీ బోగీలతో తయారైన ఈ రైలును 18 నెలలు కష్టపడి తయారు చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలును తయారు చేశారు. దీని తయారీకి 100 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ రైలులో మొత్తం 16 కోచులుంటాయి.
ఆటోమెటిక్ డోర్లు, జీపీఎస్ తో అనుసంధానమైన ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆన్ బోర్డ్ వైఫై, టచ్ ఫ్రీ బయో వాక్యూమ్ టాయిలెట్స్, ఎల్ఈడీ లైటింగ్, మొబైల్ చార్జింగ్ పాయింట్స్.. లాంటి అత్యాధునిక సాంకేతికతతో ఈ రైలును తయారు చేశారు. ప్రతి కోచ్ కు 52 సీట్లు ఉండే ఈ ట్రెయిన్ లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ట్రెయిన్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ లోకి సీట్లను రొటేట్ చేసుకోవచ్చు.