వాహ్.. రాజ దంపతులు అయినా.. వారి లగేజీ వారే మోసుకున్నారు.. వైరల్ వీడియో..!

సాధారణంగా రాజులు, రాజ కుటుంబీకులు అంటే.. వారికి ఎక్కడైనా మర్యాదలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. వారికి అన్ని పనులు చేసి పెట్టేందుకు నౌకర్లు ఉంటారు. సకల భోగాలు ఉంటాయి. అయితే వాటన్నింటినీ కాదని, ఆ రాజ కుటుంబం తమ లగేజీని తామే మోసుకున్నారు. రాజ కుటుంబానికి చెందినా.. తామూ సామాన్య మనుషులమేనని చాటి చెప్పారు. ఈ క్రమంలో వారి హుందాతనానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. రాజ కుటుంబీకులు అయినా.. ఏ మాత్రం గర్వపడకుండా వారి పని వారే చేసుకోవడంపై అందరూ వారిని ప్రశంసిస్తున్నారు.

Sweden king and queen carried their own bags

స్వీడన్ రాజు కార్ల్ గుస్తాఫ్ ఫోక్ హ్యుబెర్టస్, రాణి సిల్వివా రెనాటే సోమ్మర్లాత్‌లు 5 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో వారు న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రాగా వారిని ఎంపీ బాబుల్ సుప్రియో రిసీవ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారు తమ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్‌తోపాటు ప్రధాని మోదీని కూడా కలవాల్సి ఉంది.

అయితే ఎయిర్‌పోర్టులో ఆ రాజ దంపతులు తమ సూట్‌కేసులను తామే మోసుకుంటూ కనిపించారు. దీంతో వారి నిరాడంబరతను చూసి నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు. రాజ కుటుంబీలకు పనులు చేసి పెట్టేందుకు పని వారు ఉన్నా.. వారు తమ లగేజీని తామే మోసుకోవడం అభినందనీయమని ట్విట్టర్‌లో అందరూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ రాజ దంపతులు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!