మందు కొట్టేటప్పుడు ‘చీర్స్’ అని ఎందుకంటారో తెలుసా..?

ఆఫీసుకు వెళ్లే ముందు కాఫీ తాగి వెళ్లడం నాకు రోజూ ఉన్న అలవాటు. ఇవాళ హాలిడే కావడంతో నాతో పాటే లేచిన నా పాప నేను కాఫీ తాగుతోంటే తనకి పాలు పోయమని వాళ్ల అమ్మని అడిగింది. తన ఫేవరెట్ కప్పులో పాలు తాగబోతున్న నా కూతురితో చీర్స్ బేబీ అన్నాను. తను కూడా హ్యాపీగా నాతో చీర్స్ పప్పా అనేసి తాగడం మొదలుపెట్టింది. ఇక నేను ఆఫీస్​కి బయల్దేరదామని బయటకు వెళ్లబోతోంటే పప్పా.. చీర్స్ అంటే ఏంటి అని అడిగింది. ఆ పాప లాగే మనందరికి కూడా చీర్స్ అంటే ఏంటో తెలియదు కదా. ఇద్దరు ఫ్రెండ్స్ మందుకొడుతోంటే చీర్స్ మామా అనుకోవడం.. ఇద్దరమ్మాయిలు కోక్ తాగుతున్నప్పుడు చీర్స్ బేబీ అనుకోవడం అలవాటే. కానీ ఈ చీర్స్ స్టోరీ ఏంటో ఎవరికీ తెలియదు. మరి దాని స్టోరీ ఏంటో తెలుసుకుందామా..?

కొందరికి ముక్కలేంది అన్నం ఎలా దిగదో.. మరికొందరికి మందులేనిది రోజు గడవదు. మందుబాబులం మేం మందుబాబులం.. మందుకొడితే మాకు మేమే మహారాజులం అంటూ పాటలు పాడుతుంటారు మద్యం ప్రియులు. పార్టీ ఏదైనా మందు ఉండాల్సిందే. సెలబ్రేషన్స్ ఏవైనా షాంపైన్ తాగాల్సిందే. అంతలా మద్యం మన జీవితంలో భాగమైపోయింది. అయితే ఫ్రెండ్స్​తో కలిసి మందు కొట్టినా.. తండ్రీకొడుకులు కలిసి తాగినా.. బంధువులతో కలిసి మందేసినా.. ఇలా ప్రతి సందర్భంలోనూ తాగే ముందు చీర్స్ అని చెబుతుంటాం. అసలు చీర్స్ అంటే ఏంటంటే..?

చీర్స్ అనే పదం పాత ఫ్రెంచ్ పదం చియర్ నుంచి వచ్చిందట. దీని అర్థం తల. 18వ శతాబ్ధం వరకు చియర్ అనే పదాన్ని ఆనందం అనే అర్థంలో వాడేవారట. కానీ ఆ తర్వాత అది ఉత్సాహాన్ని వర్ణించే పదంగా వాడుకలోకి వచ్చింది. అందుకే మందు తాగే ముందు అందరు చీర్స్ అని అంటారు. తాగి ఉత్సాహంగా జాయ్​ఫుల్​గా ఉండమని దాని అర్థం.

దీని వెనక ఇంకో అర్థం కూడా ఉందండోయ్. చీర్స్ కొడుతున్నప్పుడు గ్లాసులన్నీ ఒకే దగ్గరికి వస్తాయి. ఈ క్రమంలో గ్లాసులోని మద్యం చుక్కలు కిందపడతాయి. ఇలా తాగే ముందు మందు కిందపడటం వల్ల గాల్లో ఉన్న ఆత్మలకు ఉపశమనం ఇస్తుందని కొందరి నమ్మకం. మరో నమ్మకం ఏంటంటే.. గ్లాసుల శబ్ధం వినగానే అక్కడేమైనా దుష్ట ఆత్మలు ఉంటే అక్కణ్నుంచి వెళ్లిపోతాయని భావిస్తారు.

ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. మద్యం సేవించేటప్పుడు జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తామంట. అంటే గ్లాసుని పట్టుకున్నప్పుడు మన చర్మం పరోక్షంగా ఆల్కహాల్​ని తాకుతుంది. అలాగే కళ్లలో గ్లాసులోని మద్యం కనిపిస్తుండగా.. ముక్కుతో ఆ ఆల్కహాల్ వాసన చూస్తూ.. నాలుకతో రుచిని ఆస్వాదిస్తూ.. తాగుతారు. ఈ క్రమంలో చెవులు మాత్రమే ఉపయోగపడవు. ఆ లోపాన్ని పూడ్చడానికే చీర్స్ అని చెబుతూ చెవులకు కూడా ఆనందాన్ని పంచుతారట. ఇందులో నిజమెంత ఉందో కానీ చీర్స్ స్టోరీ భలే క్రేజీగా ఉందిగా.