ఏడాదిలో 11 నెలల పాటు ఆ గ్రామం నీట మునిగే ఉన్నా.. వేసవిలో మాత్రం తేలుతుంది. ఎందుకంటే.. వేసవిలో జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోతుంది.
అహ్మదాబాద్‌లోని భావ్‌నగర్ సమీపంలో ఉన్న సముద్రంలో నిష్కళంక్ మహాదేవ్ అనే ఆలయం రోజూ నీట మునుగుతూ, పైకి తేలుతూ ఉంటుంది తెలుసు కదా. శివాలయం పైకి తేలినప్పుడు అందులో ఉండే శివలింగాన్ని పూజించేందుకు జనాలు తండోప తండాలుగా అక్కడికి వెళ్తుంటారు. అయితే అది ప్రకృతి విచిత్రం. కాగా గోవాలోనూ అలాంటి ఓ విచిత్రమే జరుగుతోంది. కాకపోతే అక్కడ ఓ గ్రామం నీట మునుగుతూ తేలుతూ ఉంటుంది. అయితే రోజుకోసారి కాదు, 11 నెలకు ఒకసారి.. ఆ గ్రామం తేలుతుంది.. ఆ గ్రామమే కుర్ది..
గోవాలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొండల మధ్యలో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరివాహక ప్రాంతంలో కుర్ది అనే గ్రామం ఉంది. నిజానికి ఆ గ్రామం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. కాకపోతే 1986లో ఆ నదిపై ఆనకట్టను నిర్మించారు. దీంతో ఆ గ్రామం నీట మునిగింది. అయితే ఏడాదిలో 11 నెలల పాటు ఆ గ్రామం నీట మునిగే ఉన్నా.. వేసవిలో మాత్రం తేలుతుంది. ఎందుకంటే.. వేసవిలో జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఆ సమయంలో గ్రామం ఆనవాళ్లు, శిథిలాలు బయటకు వస్తాయి.
అలా ఒక నెల రోజుల పాటు గ్రామం మనకు కనిపిస్తుంది. దీంతో అంతకు ముందు ఆ గ్రామాన్నిఖాళీ చేసి వెళ్లిన గ్రామస్తులు ఆ ఒక్క నెల కోసం అక్కడికి వస్తారు. ఆ నెల రోజుల పాటు అక్కడే ఉండి సంబరాలు చేసుకుంటారు. అంతకు ముందు ఆ గ్రామంలో ఒక చర్చి, ఒక దేవాలయం ఉండగా.. అవిప్పుడు శిథిలయం అయ్యాయి. అయినా సరే.. ఆయా మతస్థులు వాటిల్లోనే తమ తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. విందులు, వినోదాలు చేసుకుంటుంటారు.
పోర్చుగీసు వారు 1961లో గోవాను వదిలివెళ్లాక అక్కడ నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో సలౌలిం నది ప్రాజెక్టు మొదటిది. ఇది ప్రస్తుతం దక్షిణ గోవా ప్రాంతానికి తాగు, సాగునీరు, పరిశ్రమలకు అవసరం అయ్యే నీటిని అందిస్తోంది. అయితే అప్పట్లో సీఎంగా ఉన్న దయానంద్ బందోద్కర్ కుర్ది గ్రామ ప్రజలతో మాట్లాడి, వారిని ఒప్పించి ఆ ప్రాజెక్టుకు అవసరం అయ్యే భూములను సేకరించారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టు కట్టగానే కుర్ది గ్రామం నీట మునిగింది. అప్పటికే ఆ గ్రామ ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అలాగే వారికి నష్ట పరిహారం కూడా అందించారు.
అయితే అప్పట్లో ఆ గ్రామంలో చక్కని సాగు భూములు, తోటలు ఉండేవట. కానీ ప్రాజెక్టు కారణంగా అవన్నీ నీట మునిగాయి. కేవలం ఆ గ్రామంలో ఉన్న నిర్మాణాల తాలూకు శిథిలాలే ఇప్పుడు బయట పడుతుంటాయి. అందుకే ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరిచిపోలేక వేసవిలో ఆ గ్రామం బయట పడగానే నెల రోజుల పాటు ఆ గ్రామస్తులు అక్కడ వేడుకలను జరుపుకుంటారు. కాగా అప్పట్లో ఆ గ్రామంలో మొత్తం 600 కుటుంబాలు ఉండేవట. కానీ.. వారంతా సమీపంలో ఉన్న గ్రామాల్లో స్థిర పడ్డారు. దీంతో వారంతా వేసవిలో ఆ గ్రామానికి మళ్లీ వెళ్లి సంబరాలు చేసుకుంటుంటారు..!