మీరు ఐఫోన్ వాడుతున్నారా ? అందులో ఎక్కువగా ట్రావెల్ యాప్స్, హోటల్ బుకింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు ఆ యాప్స్‌ను గనుక వాడుతుంటే.. వాటి ద్వారా మీ ఐఫోన్ స్క్రీన్‌పై మీరు చేసే పనులన్నీ ఆయా యాప్స్‌కు చెందిన డెవలపర్లకు తెలుస్తాయి. మీరు ఆ యాప్స్‌ను వాడేటప్పుడు స్క్రీన్‌పై మీరు చేసే గెస్చర్లు, టైప్ చేసే పదాలు, ఎంటర్ చేసే లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, ఇతర సమాచారం అంతా వారికి వెళ్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఇదే విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను కలిగిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ఫేస్‌బుక్, గూగుల్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలపై గత కొద్ది రోజుల నుంచి డేటా చౌర్యం విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారులకు తెలియకుండా ఆయా కంపెనీలు తమ యాప్స్, ఇతర సేవల ద్వారా వారి సమాచారాన్ని చోరీ చేస్తున్నాయని గతంలోనే తెలిసింది. దీంతో ఆ విషయాన్ని ఆయా కంపెనీలు ఒప్పుకుని యూజర్లకు క్షమాపణలు కూడా చెప్పాయి. అయితే ఇప్పుడు తాజాగా డేటా చౌర్యం విషయంలో ట్రావెల్, హోటల్ బుకింగ్ యాప్స్ కూడా అదే పంథాను కొనసాగిస్తున్నాయట. యూజర్లు ఆయా యాప్స్‌ను వాడేటప్పుడు వారు స్క్రీన్‌పై చేసే పనులన్నింటినీ ఆయా యాప్స్ రికార్డ్ చేసి కంపెనీలకు ఫీడ్‌బ్యాక్ రూపంలో పంపిస్తున్నాయట. ఈ తంతును సెషన్ రిప్లే అని వ్యవహరిస్తున్నారు. అంటే… ఇప్పటికే ఎన్నో కోట్ల మంది యూజర్ల సమాచారం సదరు ట్రావెల్, హోటల్ బుకింగ్ యాప్ కంపెనీల చేతికి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.
అయితే యాపిల్ సంస్థ ఈ విషయంపై సీరియస్‌గానే స్పందించింది. ఐఫోన్ యూజర్లకు ప్రైవసీ, సెక్యూరిటీని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, ఏవైనా యాప్‌లు ఇలా ఐఫోన్ స్క్రీన్ ను రికార్డ్ చేస్తే వాటిని వెంటనే యాప్ స్టోర్ నుంచి తొలగిస్తామని, అలాంటి యాప్‌లను డెవలప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యాపిల్ హెచ్చరించింది. ఏది ఏమైనా ట్రావెల్, హోటల్ బుకింగ్ యాప్స్‌ను ఐఫోన్లలోనే కాదు, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్. లేదంటే మన విలువైన సమాచారం దుండగుల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు.