ఒక ‘ప్రధాని’ ప్రేమకథ – ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ

-

  అతను ఒక ఆజన్మ బ్రహ్మచారి, రాజకీయాల్లో భీష్ముడు, యుద్ధం చేయాలో నేర్పే నేర్పరి. సునిశిత చమక్కులు విసిరే నాయకుడు. సున్నిత కవిత్వం రాసే భావుకుడు. ప్రకృతిని విపరీతంగా ఇష్టపడే ఓ మనీషి. దేశాన్ని, శాంతిని మనస్ఫూర్తిగా ప్రేమించే ఓ పౌరుడు. జీవితంలో పెళ్లి జోలికి వెళ్లని దీక్షాపరుడు. అయితేనేం.. అతనికీ ఓ మనసుంది. దానికీ ఓ తోడుంది. భౌతికంగా విఫలమైన ఆ ప్రేమ, అతనికి అజరామరమైన కీర్తిని సంపాదించింది. ఈ దేశానికి ఒక గొప్ప నాయకున్ని అందించింది. ఆయనే దివంగత ప్రధాని, ప్రపంచ నాయకుడు అటల్ బిహారీ వాజపేయి.

అవి వాజపేయి గ్వాలియర్‌లో చదువుకునే రోజులు. కాలేజీలో ఒక అందమైన పరిచయం. ఆ పరిచయం పేరు రాజకుమారి. ఎంతో ఒద్దికగా, పద్ధతిగా ఉండే అమ్మాయి. పెద్దగా ఇద్దరూ మాట్లాడుకునేవారుకాదు. కానీ వారి మనసులు మాత్రం గంటలు గంటలు ఊసులాడేవి. పుస్తకాలే వారి మధ్య రాయబారులు. ఓ రోజు ధైర్యం చేసిన అటల్, పుస్తకంలో లవ్‌లెటర్ పెట్టి ఇచ్చారు. ఆమె తీసుకుంది కానీ, రెండు మూడు రోజులు జవాబేమీ ఇవ్వలేదు. ఈయనకి సందిగ్ధం. చూసింది లేదా… లేక వాళ్ల పెద్దవారికెవరికైనా ఇచ్చిందా.. అబ్బే లేదు.. ఇస్తే ఈపాటికి యుద్ధం మొదలయ్యేది కదా.. ఇలా పరిపరివిధాల ఆలోచనలు. ఇంతలో ఒక అత్యవసరమైన వాజపేయి పనిమీద వేరే ఊరికి వెళ్లారు. తిరిగి రాగానే, ఊహించని విధంగా రాజకుమారికి వేరే వ్యక్తితో పెళ్లని తెలిసింది. హతాశుడైన అటల్‌జీ విలవిల్లాడారు. కోలుకున్నారు. ఆమె వివాహాన్ని గౌరవించారు. తనకు ఆమె మీద ఉన్న ప్రేమనంతా రాజకీయాల్లోకి మళ్లించారు. నిజానికి జరిగింది వేరే. రాజకుమారి ఆయన ప్రేమను అంగీకరించి, ప్రత్యుత్తరం రాసి అదే పుస్తకంలో పెట్టి ఆయనకు ఇవ్వడానికి ఎదురుచూసింది. వాజపేయి ఊళ్లో లేకపోవడంతో అది కుదరలేదు. ఇద్దరం బ్రాహ్మణులమే అన్న ధైర్యంతో ఇంట్లో చెప్పేసింది. కానీ అందులోనూ తాము ఉన్నత గోత్రస్తులమని చెప్పి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. అమ్మాయిని బయటకు వదల్లేదు. హడావుడిగా ఓ సంబంధం ఖాయం చేసి, ఢిల్లిలో నిశ్చితార్థం, గ్వాలియర్‌లో పెళ్లి జరిపించేసారు. ఆయన పేరు బ్రజ్‌నారాయణ్ కౌల్. ఓ కాలేజీలో లెక్చరర్. చాలా మంచివాడు. అయితే కాలం ఎప్పూడూ ఒకేలా ఉండదు.

అనుకోకుండా ఒకసారి రాజకుమారి ఢిల్లిలో వాజపేయికి తారసపడింది. తన ఇంటికి ఆహ్వానించి, భర్తను పరిచయం చేసింది. అతను ఫిలాసఫీలో ప్రొఫెసర్ కావడంతో వీళ్లిద్దరికి మంచి దోస్తీ కుదిరింది. రాకపోకలు బాగా పెరిగాయి. వారి పిల్లలైన నమిత, నమ్రతలతో అటల్‌జీకి విడదీయరాని బంధం పెనవేసుకుపోయింది. కొంతకాలానికి ప్రొఫెసర్‌గారు స్వర్గస్థులయ్యారు. దాంతో రాజకుమారిని, ఇద్దరు పిల్లలతో సహా తన అధికార నివాసానికి తీసుకెళ్లారు అటల్‌జీ. అప్పటినుంచీ 2004లో తన 84వ యేట చనిపోయేవరకు ఆయనతోనే ఉంది రాజకుమారి. కానీ ఏ రోజూ ఎక్కడా కనబడలేదు. వారిద్దరి అలౌకిక ప్రేమ అజరామరం. దాన్నెంతో గౌరవించిన అటల్ బిహారీ వాజపేయి కీర్తీ అజరామరం.

అటల్‌జీ రాజకుమారి కూతురు నమితను దత్తత తీసుకుని, ఘనంగా పెళ్లి జరిపించారు. నమిత కూతురు నేహ అంటే వాజపేయికి అలవిగాని ఇష్టం. తాతయ్యగా ఆ బంధాన్ని ఎంతగానో ఆస్వాదించారు అటల్‌జీ. ప్రధానమంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నేహ రాగానే అన్న వదిలేసి వచ్చేసేవారు. అమ్మ, అమ్మమ్మల కంటే ఎక్కువగా అటల్‌జీతోనే గడిపేది నేహా. గత తొమ్మిదేళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన వాజపేయికి నేహా అసాంతం తోడుగా ఉంది.

ఆ ఉద్వేగపూరితబంధానికి గుర్తుగా, అటల్‌జీ పార్థివదేహంపై కప్పిన జాతీయపతాకాన్ని ఆయన గుర్తుగా నేహాకు అందజేసారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news