సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారా.. ఐతే మీ ఆరోగ్యం జాగ్రత్త..

సోషల్ మీడియా వల్ల లాభాలెన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. దీని ద్వారా ఎవ్వరికైనా మనం చెప్పదలచుకున్న విషయాన్ని చేరవేయగలుగుతున్నాం. ఎంతో దూరంలో ఉన్నవారితో మన పక్కనే ఉన్నట్టుగా మాట్లాడగలుగుతున్నాం. సామాజికంగా, రాజకీయంగా సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది ఐతే ఇన్ని మంచి ఉపయోగాలున్న సోషల్ మీడియాని కొందరు దుండగులు ఉపయోగించే తీరు చాలామందికి దానిపై చెడు అభిప్రాయాని కలగజేస్తుంది.

ముఖ్యంగా ఫేక్ అకౌంట్లతో ఇతరులని కించపరిచే వ్యక్తులు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే తాజా సర్వే ప్రకారం సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, పోస్టులు పెట్టే వారి ఆరోగ్యం ఇబ్బందుల్లో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. తమ పేరు బయటపడకుండా వేరే ఎవరి పేరు మీదో అకౌంట్ నడుపుతూ ఎవ్వరి మీదనైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళ ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుందట.

సాధారణంగా అబధ్ధాలు చెప్పే వాళ్లకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలి. ఈ ఫేక్ అకౌంట్ వారు నడిపే వారు చెప్పేదంతా అబద్ధమే కాబట్టి అన్ని విషయాలని గుర్తు పెట్టుకునే క్రమంలో ఒత్తిడి ఎక్కువై మానసిక సమస్యలు తలెత్తుతాయి. అదీగాక తమది కాని వ్యక్తిత్వాన్ని తమదిగా చూపుతూ ఉంటే కొన్నాళ్ళకి నిజమేంటో అబద్ధమేంటో తెలియని స్థితికి వచ్చేస్తారట. అందుకే ఇలాంటి వాళ్లతో వాదించడం కష్టం అంటున్నారు.

వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అలానే ఉండేవారు ఆనందంగా ఉంటున్నారట. కానీ ఇక్కడొకలా, అక్కడొకలా కనిపించే వారు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారే అని చెబుతున్నారు. ఒకానొక సర్వే ప్రకారం సోషల్ మీడియాలో ఫేక్ గా నటించే వారందరూ ఇతరులు తమని చూసి కుళ్ళుకోవాలన్న ఉద్దేశ్యంతోనో, లేక నేను చాలా బాగున్నాను( బాగా లేకపోయినా) అని చెప్పాలనే పోస్టులు పెడతారట.