ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష

-

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-4 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహించారు అధికారులు. టీఎస్పీఎస్సీ ఈ సారి అత్యధిక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీ స్థాయిలో అభ్యర్థులు పోటీపడ్డారు. మరోవైపు గ్రూప్-4 ఎగ్జామ్ కు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.

మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరిగింది. ఆలస్యం కారణంగా కొందరిని.. సరైన పత్రాలు లేకపోవడంతో మరికొందరిని అధికారులు వెనక్కి పంపించేశారు. నల్గొండ జిల్లా చండూరులో మరియానికేతన్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఐదుగురు గ్రూప్-4 అభ్యర్థులను ఒరిజినల్ ఆధార్ కార్డు లేదని అధికారులు బయటకు పంపారు. ఆధార్ కార్డు ఒరిజినల్ కాకుండా జిరాక్స్ తేవడంతో పరీక్ష మధ్యలోనే అభ్యర్థులను వెనక్కి పంపించారు. నిజామాబాద్ జిల్లాలో ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురాని పది మంది అభ్యర్థులను ఎగ్జామ్ కు అనుమతించలేదు.

అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతి నగర్ లోని ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో ఎగ్జామ్ హాల్లోకి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఆ అభ్యర్థిని గమనించిన ఇన్విజిలేటర్ అతన్ని ఉన్నతాధికారులకు అప్పగించారు. అతని సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం సమగ్ర విచారణ నిమిత్తం ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version