Karimnagar : రాబోయే లోక్ సభ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమాను వ్యక్తం చేశారు. క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ ఉంటుందనితెలిపారు. 2014లోనూ నరేంద్ర మోదీ ప్రభంజనంలోనూ కరీంనగర్ లో బీఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు.
గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితమైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదు అని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా శాసనసభలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని అన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారని, 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. కరీంనగర్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో, అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాజకీయాలు అవసరం లేదని తెలిపారు. శ్రీరాముడు అందరివాడు, దైవ కార్యక్రమం ఎవరు చేసినా ఆనందిస్తాం,స్వాగతిస్తామని’ గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.