ఎన్నికలు ముగిసే వరకు మద్యపానం నిషేధించాలి…
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యపానం ఉపయోగిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మహిళలు ఆందోళనకు గురవుతున్నారని, ఎన్నికలు ముగిసే వరకు మద్యాన్ని నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌కు ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో సీఈఓను కలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కుల సంఘాలకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు. సంఘాలు లేని చోట కూడా ఏర్పాటు చేసి మరీ డబ్బులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. మద్యం, ధన ప్రవాహం వంటి వాటిపై సరైన నిఘా లేకపోవడం వల్ల వెనుక బడిన వర్గాల వారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.