తెలంగాణలో విద్యార్థులు, సామాన్యుల చావుకు కారణమైన పార్టీలతో కోదండరాం పొత్తు పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఆర్యవైశ్య సంఘం నేతలు, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అటు ఢిల్లీకి పోతుంది, తెదేపాకు ఓటేస్తే ఇటు అమరావతికి చేరుతుంది, కోదండరాంకు ఓటేస్తే అది ఎటుపోతదో తెలియదు అంటూ ఆయన విమర్శించారు. తెరాస ఓటు వేస్తే కేసీఆర్‌కు వెళ్తుందనే విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. వీటి ఫలితమే కొన్ని గ్రామపంచాయతీలు తెరాసకే మా ఓటు అంటూ తీర్మానం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను బొందపెడతామన్న తెదేపా.. ఆ పార్టీతోనే జతకట్టిందని నీతిబాహ్యమైన పొత్తుకి సిద్ధపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. మన నీళ్లు మనం తెచ్చుకుంటుంటే కాంగ్రెస్ నేతలు మోకాలు అడ్డుపెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కాంగ్రెస్‌కు తోక పార్టీ అయిందన్నారు. 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నా కోదండరాం నేడు ముష్టి మూడు సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడం విడ్డూరంగా ఉందన్నారు.