సీఎం సీఎం…అనగానే సీఎం కాలేనని మీరు ఓటు వేసి మన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తేనే సీఎం అవుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగ్గంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… నమ్మకమైన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాలి… ఈపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరే వారు మనకు అవసరం లేదన్నారు. భవిష్యత్ తరాలకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా యువ నాయకత్వం కావాలన్నారు. ఒక పోస్టు మాస్టర్ మనవడు ఎలా ఉంటాడో.. అలాగే ఉంటానన్నారు. అతి సామన్య కుటుంబ నుంచి కష్టాలు తెలిసిన వాడిగా పెరిగానన్నారు. ఈ సందర్భంగా ఆయన తెదేపా అవినీతి గురించి ప్రధానంగా తీవ్ర విమర్శలు చేశారు. జిల్లేడు చెట్టుకు పారిజాతాలు పూస్తాయా? అదే విధంగా మళ్లీ తెలుగుదేశంను 2019లో తీసుకొస్తే మళ్లీ నీతి అనేది ఉండదని.. అవినీతితోనే రాష్ట్రం నిండిపోతుందన్నారు.
రియల్ టైం గవర్నెన్స్ పగుళ్లను గుర్తించదా?
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం సమీపంలో దాదాపు కిలోమీటర్ మేర రోడ్డు పగుళ్ళు రావడాన్ని ది గ్రేట్ సీఎం చంద్రబాబు నాయుడుగారి రియల్ టైం గవర్నెన్స్ గుర్తించదా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు రోడ్ల నాణ్యతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి రోడ్లు చెబుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. మీ మాటలకి చేసే చేతలకి ఏ మాత్రం పొంతన లేదని చంద్రబాబుని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం రహదారికి భారీగా బీటలు ఏర్పడటంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్న సుమారు పది లారీలను డ్రైవర్లు అక్కడే వదిలేసి దూరంగా పరుగులు తీసిన విషయం తెలిసిందే..