నూతన సంవత్సర వేడుకలకు తిరుమల పుణ్యక్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కొత్త సంవత్సరంలో అంతా సుభాలు కలగాలని కోరుకుంటూ…స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ కలియుగ దైవం దర్శనమిస్తున్నారు. ఇందుకుగాను భక్తకోటికి మెరుగైన సేవలందించి.. స్వామివారి దర్శనం కనువిందుగా కల్పించడానికి తితిదే పలు చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాకారం, గోపురాలు, ధ్వజస్తంభం, అంతరాలయాలను రంగురంగుల పూలు, విద్యుద్దీపాలతో అలంకరించింది. భక్తుల తాకిడి అధికంగా ఉండటం వల్ల శ్రీవారికి సోమ, మంగళవారాల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది.
సహస్రదీపాలంకరణ సేవను మాత్రం సర్కారు సేవగా నిర్వహించనుంది. వేకువజామున 4.30 గంటల నుంచి ధర్మదర్శనాన్ని మొదలుబెట్టి అర్ధరాత్రి వరకు సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది.