కృష్ణా జిల్లా వైసీపీ నేత వంగవీటి రాధా ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయవాడ సెంట్రల్ టిక్కెట్ తన అన్న వంగవీటి రాధాకు కేటాయించకపోవడంతో ఆయన సోదరుడు ఉయ్యూరు కౌన్సిలర్, జిల్లా పార్టీ ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
విజయవాడలో ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో విజయవాడ సెంట్రల్ టిక్కెట్ తనకు కేటాయించాలని రాధాకృష్ణా కోరగా జగన్ నుంచి ఎలాంటి హామీ రాలేదని తెలిసింది.
దీంతో మనస్తాపానికి గురైన రాధాకృష్ణా సమావేశం మధ్యలోనే తన అనుచరరులతో కలిసి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత నిన్న అర్థరాత్రి వరకు రాధా తన అనుచరులతో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాధా అనుచరులు నగరంలోని వైసీపీ ఫ్లెక్సీలను తొలగించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వంగవీటి రాధాకృష్ణా అలకతో రంగంలోకి దిగిన వైసీపీ పెద్దలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ మార్పుపై రాధాని ప్రశ్నించగా త్వరలోనే భవిష్యత్ కార్యచరణ వెల్లడిస్తానని ఆయన వివరించారు.