తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. విస్తారంగా వర్షాలు కురుస్తుడటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతుండగా.. రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. రిజర్వాయర్లు అన్ని నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు వరద నీటిని ఎత్తి పంపింగ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటిని వృథా పోనివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇకపోతే భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక హైదరాబాద్‌లో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
అయితే, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచారు. ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తున్నందున 8 గేట్లను ఎత్తి 25000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,95,767 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లోగా ఉంది. జలాశయం నీటి మట్టం 1088.7 అడుగులుగా ఉండగా..72.230 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహరాష్ట్రతో పాటు మంజీరా నది నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు ఎస్సార్పెస్సీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నట్లు వెల్లడించారు.