పవన్ సభలో తొక్కిసలాట.. యువకుడు మృతి

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ సభకు పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా హాజరుకావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సభ కోసం ఏర్పాటు చేసిన స్పీకర్ల కోసం అమర్చిన ఇనుప కడ్డీలు జారిపోవడంతో గందరగోళం నెలకొందని.. జనం భయంతో పరుగులు తీసి ఒకరిమీద ఒకరు పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన యువకున్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి పేరు సిరాజ్‌ (30)గా పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సిరాజ్‌ కు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కుమార్తె దివ్యాంగురాలని తెలుస్తుంది. సిరాజ్‌ మరణ వార్త తెలిసి కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.