108 ఏళ్ల తేడాతో వచ్చిన రెండు భయంకర అంటువ్యాధులను ఓ మహిళ ఓడించింది. అద్భుతాలు జరుగుతాయని వింటుంటాం కానీ, మన దైనందిన జీవితాల్లో వాటిని చూసే భాగ్యం కలగదు. ప్రత్యేకించి ప్రపంచం మొత్తం స్థంభించిపోయిన ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అస్సలు సాధ్యం కాదు.
స్పెయిన్‌లో ఒక అద్భుతం జరిగినట్లు అక్కడి ‘ఆలివ్ ప్రెస్ ’ అనే ఒక పత్రిక తెలిపింది. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అనా డెల్ వాల్లే అనే ఐదేళ్ల పాప దాని బారిన పడి కోలుకుంది. నాడు స్పానిష్ ఫ్లూ సృష్టించిన మారణహోమం అంతాఇంతా కాదు. దాదాపు ప్రపంచ జనాభాలో మూడోవంతు అంటే, 50 కోట్ల మందికి సోకింది. మూడేళ్లపాటు వీరవిహారం చేసిన ఆ భయంకర వ్యాధి 5 కోట్ల మందిని పొట్టనపెట్టుకుందని అంచనా. సమాచార వ్యవస్థలు అందుబాటులో లేని ఆ రోజుల్లో లెక్కలు సరిగా తెలియవు. కానీ, ఇది ఇంకా చాలా ఎక్కువగా 10 కోట్ల వరకు ఉంటుందని వైరాలజీ నిపుణులు చెబుతుంటారు.
ఇప్పుడు సరిగ్గా 102 సంవత్సరాల తర్వాత, అదే పాప, ఇప్పటి 107 ఏళ్ల బామ్మకు కరోనా సోకింది. ఆశ్చర్యకరంగా ఆవిడ కోలుకుంది. ఇక రోండా పట్టణంలోని వారి కుటుంబంలో ఆనందం అంతా ఇంతా కాదు. అనా డెల్, రోండాకు దగ్గర్లోని ఒక నర్సింగ్ హోంలో నివసించేది. అక్కడే ఆమెకు కరోనా సోకింది. తనతోపాటు ఉన్న 60మంది కూడా కరోనా బారిన పడ్డారు. అక్కన్నుంచి ఆమెను లా లీనియాలోని ఒక ఆసుపత్రిలో చేర్చగా, కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయింది.
అన్నట్లు స్పెయిన్‌లోని ఈ రోండా పట్టణం విచిత్రంగా పర్వతంపై ఉంటుంది. చూసేవారికి చాలా అందంగా కనబడుతుంది.
1913లో పుట్టిన అనాడెల్‌కు ఇంకో ఆర్నెళ్లలో 107 ఏళ్లు నిండుతాయి. దీంతో స్పెయిన్‌లోనే కరోనానుండి బతికి బయటపడ్డ అతిపెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే పెద్దవయసు కరోనా రక్షితుడిగా డచ్‌కు చెందిన 107 ఏళ్ల కార్నిలియా రాస్ ఉన్నారు. అనాడెల్ కోడలు మీడియాతో మాట్లాడుతూ, తాము వైద్యులకు ఎంతో రుణపడిఉన్నామని తెలిపింది. అత్తగారిది చాలా పెద్ద వయసు కావడంతో డాక్టర్లు చికిత్స జాగ్రత్తగా, మెల్లగా చేసారని చెప్పింది. చికిత్సకు ఆమె బాగా స్పందిస్తోందనీ, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు మాకు చెప్పారని మీడియాతో చెప్పింది. (ఇది కూడా చదవండి : ‘అల్మిదా’ పది పాసైన మహిళ… వేల వైరస్‌లు గుర్తించింది…!)
‘‘ మా అత్తగారు ఇప్పటికీ తన పనులు తానే చేసుఉంటుంది. కర్ర సాయంతో వాకింగ్‌కు కూడా వెళుతుంది. భోజనం కూడా బాగానే చేస్తుంది. ’’ అంటూ ఆ కోడలు పాకీ సాంచెజ్ ఆనందంగా తెలిపింది.
స్పెయిన్‌లో ప్రస్తుతం మొత్తం కరోనా కేసులు 2,19,764 కాగా, చికిత్స పొందుతున్నవారు 1,04,885. కోలుకున్నవారు 92,355 కాగా, మరణించిన వారు 22,524. ఇప్పుడు స్పెయిన్‌లో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది.
(ఇది కూడా చదవండి : పాపం మేరీ.. 26 ఏళ్ళు క్వారంటైన్లో ఉన్న మహిళ)