కరోనా కారణంగా మన దేశంలో ఇంకా స్కూళ్లు ఓపెన్ కాలేదు. అలా అని చెప్పి కేంద్రం ఇంకా ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ఎలాంటి మార్గదర్శకాలనూ జారీ చేయలేదు. కానీ ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అందుకుగాను స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ ఎత్తున ఫీజలు వసూలు చేస్తున్నాయి. మరోవైపు తడిసి మోపెడవుతున్న ఫీజులతోపాటు తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ కొనివ్వడం, వాటికి ఇంటర్నెట్ పెట్టించేందుకు అయ్యే ఖర్చులతో పిల్లల తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంత చేసినా.. ఆన్‌లైన్ తరగతుల వల్ల విద్యార్థులకు మేలు జరగకపోగా.. వారిలో ఒత్తిడి అధికమవుతోంది. దీంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నివాసం ఉండే ఓ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక ఆన్‌లైన్ క్లాసులు, విపరీతమైన హోం వర్క్‌తో తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు ఖుషి. ఆమె తండ్రి రోహిత్ షింగాడియాకు స్థానికంగా ఓ ఆటో గ్యారేజ్ ఉంది. కరోనా వల్ల గత 3 నెలల నుంచి వ్యాపారం లేక అతనికి తీవ్రమైన నష్టాలు వచ్చాయి. అయినప్పటికీ అప్పు చేసి రూ.10వేలతో తన కుమార్తెకు ఆన్‌లైన్ తరగతుల కోసం ఓ స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. ఆ కుటుంబానికి ఇంటి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడమే కష్టంగా ఉంది. అయినా కూతురి చదువుకోసం అతను డబ్బు అప్పు తెచ్చాడు.
అయితే కరోనా వల్ల ఖుషిని ఎగ్జామ్స్ లేకుండానే 7 నుంచి 8వ తరగతికి ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించారు. దానికి రోహిత్ భారీగానే స్కూల్‌కు ఫీజు చెల్లించాడు. దీంతో ఖుషి నిత్యం ఇంట్లో ఉంటూ స్మార్ట్‌ఫోన్లో ఆన్‌లైన్ క్లాసుల్లో పాల్గొంటూ.. చదువుకుంటోంది. ఇక ఆమెకు నిత్యం విపరీతమైన హోం వర్క్ ఇవ్వసాగారు. దీంతో ఆమె తీవ్రమైన ఒత్తిడికి గురైంది. మరోవైపు ఇంట్లో తల్లిదండ్రులు ఆమెపై చదవమని, హోం వర్క్ చేయమని ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో ఆమె ఆ ఒత్తిడిని భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆన్‌లైన్ క్లాసుల వల్ల విద్యార్థుల్లో ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఈ ఒక్క సంఘటన మనకు ఉదాహరణ చెబుతుంది. కేంద్రం ఇప్పటికైనా ఆన్‌లైన్ విద్యపై స్కూళ్లకు మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుంటుంది.