కామ్య కార్తికేయన్. ఈమె ఓ పన్నేండ్ల బాలిక. ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నది. కానీ ఈ అమ్మాయి అందరిలా స్కూల్‌కు వెళ్లడం, ఇంటిదగ్గర హోంవర్క్ చేసుకోవడం, ఆ తర్వాత అమ్మానాన్నలతో సరదాగా కబుర్లు చెప్పడం మాత్రమే కాదు, ఆమె దగ్గర మరో అద్భుతమైన టాలెంట్ కూడా ఉంది. అదేంటో తెలుసా..? పెద్దపెద్ద పర్వతాలను అవలీలగా అధిరోహించడం.
ఇప్పటికే ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాల్లోని అత్యంత ఎత్తయిన పర్వాతాలను (వీటిలో రెండు పర్వాతాలు 6 వేల మీటర్ల కంటే ఎత్తయినవి) అధిరోహించిన కామ్య.. గత ఆగస్టులో లఢక్‌లోని 6,262 మీటర్ల ఎత్తయిన మెంటాక్ కాంగ్రి-2 పర్వాతాన్ని కూడా అధిరోహించింది. తాజాగా దక్షిణ అమెరికా ఖండంలో అర్జెంటీనాలోని 6,962 మీటర్ల ఎత్తయిన అకోంకాగ్వా పర్వతంపై భారత పతాకాన్ని ఎగురవేసి.. అతిచిన్న వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించిన బాలికగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.
కామ్య తండ్రి ఎస్. కార్తికేయన్ ఇండియన్ నేవీలో కమాండర్ కాగా, తల్లి లావణ్య ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కామ్య మూడేండ్ల వయసప్పటి నుంచే పర్వాతారోహణ గురించి ఆసక్తిగా వినేదని, అందుకే తనకు పుణెలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో పర్వతారోహణపై శిక్షణ ఇప్పించి ప్రోత్సహించామని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి కామ్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.