రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటనలో ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి విచారిస్తోంది. ఈ క్రమంలోనే సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్నాపత్రాలు లభించాయి. ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, డీఏవో పేపర్1, పేపర్ 2, ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏఈ సివిల్, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ జేఎల్ , గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను సిట్ అధికారులు గుర్తించారు.
మరోవైపు ఈ కేసులో నిందితులను మూడో రోజు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘షమీమ్ కంప్యూటర్ నుంచి ప్రశాంత్‌రెడ్డికి .. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ పంపించాడు. ఎనీ డెస్క్ అప్లికేషన్‌ను షమీమ్ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన రాజశేఖర్… పెన్‌డ్రైవ్ ద్వారా సమాచారాన్ని చోరీ చేశాడు. తనపై నిఘా ఉండటంతో షమీమ్ కంప్యూటర్‌ను రాజశేఖర్ ఉపయోగించుకున్నట్టు’ పోలీసులు గుర్తించారు.